- పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలి
- అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి): హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. 21న సాయం త్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు.
22న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో లోక్ మంతన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి రెండు రోజులపాటు నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం ఉన్నతా ధికారులతో సీఎస్ సమావేశమయ్యారు.
బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్‌రావు, ఐఅండ్‌పీఆర్ శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ పాల్గొన్నారు.