కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని రాసిమెట్ట గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు మడావి ఆనందరావు అరుదైన ఘనత సాధించాడు. ఆదివాసీల నృత్యం, గోండు సంప్రదాయాలపై గోల్డ్ పెయింటింగ్ విధానంలో చిత్తర్వులు గీసి రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును మెప్పించాడు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో ఆమె చేతుల మీదుగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నాడు.
ఆనందరావు 13 రోజుల పాటు గోల్డ్ పెయింటింగ్ వర్క్‌షాపులో పాల్గొని ఎత్తుమసూర్ దేవత, గుస్సాడీ, తాదో, డప్పు, తుడుం గోండు సంస్కృతికి సంబంధించి పెయింటింగ్స్ వేశాడు. యువకుడి ప్రతిభకు సరైన గౌరవం లభించిందని జిల్లా ప్రముఖులు కొనియాడుతున్నారు. అతడికి బుధవారం పలువురు అభినందనలు తెలిపారు.