మిలిగినవి బంధువులకు ఇచ్చేయండి
ఎన్‌కౌంటర్ మృతుల కేసులో హైకోర్టు
విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాల్లో పిటిషనర్ ఐలమ్మ భర్త మృతదేహాన్ని భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ దాకా ఆ ఒక్క మృతదేహాన్ని భద్రపరచి మిగిలినవాటిని బంధువులకు అప్పగించాలని చెప్పింది.
ఎన్‌కౌంటర్ అనంతరం జరిగిన పరిణామాలపై, తీసుకున్న చర్యలపై ఏయే నిబంధనలను అమలు చేశారో రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది. ఎన్‌కౌంటర్ బూటకమని, దానిపై దర్యాప్తు జరిపించాలంటూ మృతుడు మల్లయ్య భార్య కే ఐలమ్మ అలియాస్ మీనా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది మహేష్‌రాజే వాదనలు వినిపిస్తూ.. పోస్టుమార్టం పూర్తయిందని, నివేదిక అందాల్సి ఉందని తెలిపారు.
మృతదేహాలను అప్పగించాలని బంధువులు కోరుతున్నారని చెప్పారు. తన భర్త మృతదేహాన్ని చూడటానికి ఐలమ్మను అనుమతించామని చెప్పగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఇంకేమి మిగిలిందని ప్రశ్నించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని.. బంధువుల సమక్షంలో విచారణ చేయాల్సి ఉందని, విచారణకు వస్తున్నట్టు పిటిషనర్ సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు.
ఎన్‌కౌంటర్ వాస్తవమైతే.. కోర్టులో విచారణ జరుగుతుండగా వాడావుడిగా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది మహేష్‌రాజె విభేదిస్తూ హనుమకొండ కాకతీయ వైద్యకళాశాల నుంచి ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించిందని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టంను వీడియో చిత్రీకించామని, పోస్టుమార్టం సమయంలో పిటినర్‌ను అనుమతించామని తెలిపారు.
అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని, ఇంకేం కావాలని అన్నారు. మృతదేహాలను అప్పగించాలని బంధువులు అడుగుతున్నారని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మృతదేహాలను ఎంతకాలం భద్రపరచాలని ఆదేశాలు ఇవ్వాలని ప్రశ్నించగా. దీనిపై పిటిషనర్ న్యాయవాది సమాధానమిస్తూ గతంలో పలుమార్లు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి మృతదేహాలను తరలించారని, ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తలేదని అన్నా రు.
పోలీసుల చర్యపై తమకు అనుమానాలున్నాయని, రీపోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ నిపుణులైన డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించినపుడు వారిని ఎలా అనుమానిస్తామని, రీపోస్టుమార్టం నిర్వహించాలని ఎలా ఆదేశాలు జారీ చేయాలని ప్రశ్నించారు. పిటిషనర్ అంగీకరిస్తే మృతదేహా లను పరిశీలించడానికి ఓ న్యాయవాదిని నియమిస్తానని సూచించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ పోస్టుమార్టం నివేదిక వచ్చేదాకా పిటిషనర్ భర్త మృతదేహాన్ని భద్రపరచాలని కోరారు. పిటిషనర్ భర్త మృతదేహంపై 11 చోట్ల గాయాలున్నాయని, కేవలం 5 నుంచి 10 నిమిషాలే అనుమతించారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 5కు వాయిదా వేస్తూ ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించి ఏయే నిబంధనలను అమలు చేశారో రాతపూర్వకంగా నివేదించాలని పోలీసులను ఆదేశించారు.