calender_icon.png 18 January, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ సమర్పయామి..

02-09-2024 01:31:11 AM

 రెండో టెస్టులోనూ ఓడిపోయిన శ్రీలంక

భారత్‌పై సిరీస్ విజయం గాలివాటమే!

ఐదు వికెట్లతో చెలరేగిన సెంచరీ హీరో.. 

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదటి టెస్టును 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లిష్ జట్టును ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన లంకేయులు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 427 పరుగులకు కట్టడి చేయగలిగారు. రూట్ (143), అట్కిన్సన్ (118) సెంచరీలతో కదం తొక్కారు.

మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక కేవలం 196 పరుగులు మాత్రమే చేసింది. కమిందు మెండిస్ (74) ఒక్కడే రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 251 పరుగుల స్కోరు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఇంగ్లండ్ 482 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. 483 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. కెప్టెన్ డిసిల్వ (50), చండిమాల్ (58), కరుణరత్నె (55) అర్ధ సెంచరీలు చేసినా కానీ లంక మాత్రం టార్గెట్‌ను చేధించలేకపోయింది.

300 పరుగుల మార్కును కూడా చేరుకోలేక చివరికి 292 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్‌కు 190 పరుగుల భారీ విజయం దక్కింది. ఈ విజయంతో టెస్టు సిరీస్ ఇంగ్లిష్ జట్టు వశం అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు ఏడు వికెట్లు  తీసిన అట్కిన్‌సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌లో మిగిలి ఉన్న నామమాత్రపు మూడో టెస్టు ఈ నెల 6 నుంచి మొదలుకానుంది. కనీసం ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని శ్రీలంక భావిస్తోంది.