calender_icon.png 26 October, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ హాజరు

12-09-2024 12:00:00 AM

  1. నూతన విధానానికి శ్రీకారం చుట్టిన సర్కార్ 
  2. మెదక్ జిల్లాలో 922 పాఠశాలల్లో అమలు

మెదక్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): సర్కార్ బడుల్లో విద్యార్థుల హాజరును పారదర్శకంగా నమోదు చేయడానికి ప్రభుత్వం నూతన ప్రక్రియకు నాంది పలికింది. ఇందుకోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) యాప్‌ను రూపొందించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల హాజరు ను ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా నమోదు చేయడానికి ఉపాధ్యాయులు ఇప్పటికే కసరత్తు చేస్తు న్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో విద్యార్థుల పేర్లకు అనుగుణంగా ఫొటోలను అప్ లోడ్ చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొస్తోంది.

పలు ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ల తరహాలోనే విద్యాశాఖ రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మెదక్ జిల్లాలో మొత్తం 922 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేల మంది విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేయనున్నారు. విద్యార్థుల గైర్హాజర్‌కు చెక్ పెట్టేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

పాఠశాల ఆవరణలోనే..

విద్యార్థి ఎక్కడ చదువుతున్నాడో అదే బడిలో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేయనున్నారు. ప్రతి విద్యార్థికి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ కేటాయిస్తారు. ఒకరి నంబర్‌పై మరొకరి హాజరు నమోదు చేయాలన్నా వీలుపడదు. తరగతిలో ఉండే విద్యార్థి ఫొటో చుట్టూ ఆకుపచ్చ రంగు సర్కిల్ ఏర్పడుతుంది. లేకుంటే ఎర్ర రంగు చూపిస్తుంది. మొదటి పీరియడ్‌లో ఉపాధ్యాయులు ఆ వివరాలను తమ ఫోన్‌లో నమోదు చేస్తారు.

ఎక్కడైనా హాజరు శాతం తక్కువగా ఉంటే డీఈవో, ఎంఈవో ఆ పాఠశాల హెచ్‌ఎంను వివరణ కోరుతారు. అదే విధంగా ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని కూడా పాఠశాల ఆవరణలో నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యా ప్రమాణాలను పాటించడమే కాకుండా నిత్యం విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన అనుసరించేలా చర్యలు చేపడుతున్నారు. 

అక్రమాలకు చెక్..

ముఖ గుర్తింపు ఆధారిత హాజరు తో అక్రమాలకు చెక్ పడనుంది. చాలా చోట్ల తక్కువ మంది విద్యార్థులు మధ్యా హ్న భోజనం చేస్తున్నా ఆ సంఖ్యను తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌తో కచ్చితమైన వివరాలు పారదర్శకంగా తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్న భోజనం బిల్లు లు ముఖ గుర్తింపు ఆధారిత హాజరుతో మంజూరయ్యే అవకా శం ఉంది. పాఠ్యపుస్తకాల విషయంలోనూ కచ్చితమైన సంఖ్య తెలిసే అవకాశం ఉంది. మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు జరుగుతున్నట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ‘విజయక్రాంతి’కి తెలిపారు.