17-03-2025 01:19:30 AM
భానుడి భగభగలు..
మార్చిలోనే దంచుతున్న ఎండలు
రానున్న రోజుల్లో మరింత ప్రమాదం
మెదక్‌లో 40 డిగ్రీలు నమోదు
ఎండలో తిరగొద్దంటున్న డాక్టర్లు
మెదక్, మార్చి 16(విజయక్రాంతి): భానుడు నిప్పులు గక్కుతున్నాడు...సూర్యోదయం మొదలు రాత్రి 7 గంటల వరకు ఎండ వేడిమి పెరుగుతోంది..మార్చి నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో రానున్న రోజులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండలో ప్రజలు తిరగవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్చి రెండవ వారంలోనే ఎండల తీవ్రత పెరిగిపోతుంది. మెదక్ జిల్లాలో ఆదివారం నాడు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. గత సంవత్సరం ఏప్రిల్, మేలో ఎండలు ప్రభావం చూపితే ఈసారి మార్చి నెలలోనే ఎండ తీవ్రత పెరిగిపోతుంది. దీంతో సామాన్య ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుండే ఎండ తీవ్రత పెరిగిపోతుంది. రాత్రి 7 గంటలు దాటినా వేడిమి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఇంకెంత భయానకంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు, వృద్దులు బయటకు రావొద్దు...
ఎండల వేడిమి పెరుగుతున్న దృష్ట్యా జనాలు ఆరుబయట తిరగవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల చిన్న పిల్లల్లో బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దీంతో వారికి త్వరగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వృద్దుల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుంది. తగినంత నీరు తీసుకొని, నీడ ప్రాంతాల్లోనే మెలగాల్సిన అవసరం ఉంటుంది. వైద్యులను సంప్రదించి ఆహార నియమాలతో పాటు ఇతరత్రా సూచనలు తీసుకోవాడం మంచిదని సూచిస్తున్నారు.
చర్మ సంరక్షణ చేసుకోవాలి...
ఎండాకాలంలో చర్మ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అతి నీలలోహిత కిరణాలు సోకి చర్మంపై ముడతలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో చర్మ సౌదర్యం దెబ్బతినడమే కాకుండా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా నీటిని సేవించడమే కాకుండా చర్మంపై బాడీ లోషన్లు రాసుకుంటే మంచిది. అలాగే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కీర దోసలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ చర్మ సౌదర్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఉండడమే మంచిది.
డాక్టర్ కార్తిక్, చర్మవ్యాధి నిపుణులు, మెదక్