calender_icon.png 29 September, 2024 | 4:54 AM

పోరుకు సిద్ధం

29-09-2024 03:00:16 AM

తెలంగాణలో అధికారమే లక్ష్యం

  1. స్థానిక సమస్యలపైనే గురిపెట్టాలి
  2. నాయకులకు 50 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్
  3. సభ్యత్వాలు పూర్తి చేయకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం
  4. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం

* ఎన్నికేదైనా విజయం బీజేపీదే కావాలి. గెలిచిన వాళ్లు మళ్లీ గెలవాలి.. ఓడిన వాళ్లు గెలిచేలా కష్టపడాలి. సభ్యత్వ నమోదులో యువతను భాగస్వామ్యం చేయాలి. మెంబర్‌షిప్ కార్యక్రమం పూర్తయిన తర్వాత తాను నేను మళ్లీ రాష్ట్రానికొస్తా. లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు, 77 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం పెద్ద కష్టమేమీ కాదు. 

 బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకులు పోరాటానికి సిద్ధం కావాలని, 15 రోజుల్లో నిర్దేశించుకున్న పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తిచేయాలని బీజేపీ జాతీ య అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.

స్థానిక సమస్యలపై పోరాటం చేసి ప్రజల్లో అభిమానం చూరగొనేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నాయకులకు పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై జేపీ నడ్డా ఆరా తీశారు. 50 లక్షలకుపైగా సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోవాలని, దాన్ని 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు కేవలం 9 లక్షలు మాత్రమే పూర్తికావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.

గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓడిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తిచేయాలని తెలిపారు. ప్రతి మండలంలోని శక్తి కేంద్రాల (ఐదు నుంచి ఆరు పోలింగ్ బూతులు)లో పర్యటించి సభ్యత్వం నమోదు చేయాలని పేర్కొన్నారు. త్వరలో రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు.

ఎన్నికేదైనా గెలవాల్సిందే

లక్ష్యాన్ని భుజానపైన వేసుకొని పనిచేయాలని నాయకులకు జేపీ నడ్డా సూచించినట్లు పార్టీ నేతలు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలున్నాయని, ఆ దిశగా ఇప్పటి నుంచే కష్టపడాలని పేర్కొన్నారు. ఎన్నికేదైనా విజయం బీజేపీదే కావాలని మార్గనిర్దేశం చేశారు. గెలిచిన వాళ్లు మళ్లీ గెలిచేలా.. ఓడిన వాళ్లు గెలిచేలా కష్టపడాలన్నారు.

సభ్యత్వ నమోదులో యువతను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మెంబర్‌షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత తాను మళ్లీ రాష్ట్రానికొస్తానని నాయకులతో ఆయన చెప్పినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు, 77 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం పెద్ద కష్టమేమీ కాదని నేతలకు ఆయన సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రచించుకొని ముందుకుసాగాలని సూచించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన నడ్డాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం పలికారు.

జేపీ నడ్డా పర్యటన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని బీజేపీ నేతలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణలో లేని సమయంలో జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.