calender_icon.png 28 December, 2024 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 కోట్లతో క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలకు ప్రణాళికలు సిద్ధం..

08-11-2024 02:53:57 PM

నూతన హాకీ స్టేడియం  ఏర్పాటుకు స్థల పరిశీలన

రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ కే. శివసేన రెడ్డి

వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో దాదాపు రూ. 25 కోట్ల వ్యయంతో క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ కే. శివసేన రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని, మర్రికుంట మెడికల్ కళాశాల వద్ద కొత్తగా హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన, పెద్దగూడెం గ్రామ పరిధిలోని క్రీడా ప్రాంగణం, గ్రామ పక్కన ఉన్న మరో 3 ఎకరాల ఖాళీ స్థలాలను పరిశీలించారు. 

ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు.  పట్టణం మధ్యలో  ఉన్న ఈ ఖాళీ స్థలంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు డి.పి.ఆర్ సిద్ధం చేయాలని స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ ను ఆదేశించారు. అవసరం అయితే పక్కనే ఒక సమీకృత ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఏమేరకు అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ఇండోర్ స్టేడియంలో ఈరోజు నుండి నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ ఎంపికల పోటీలను తిలకించారు. బ్యాడ్మింటన్ వుడెన్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు చేయాలని అధికారులను సూచించారు. అనంతరం మర్రికుంట మెడికల్ కళాశాల వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. 12.5 ఎకరాల ఖాళీ స్థలం ఉండి పక్కనే మెడికల్ కళాశాల, కలక్టరేట్ భవనం ఉండటం వల్ల ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. హాకీ స్టేడియంలో సింతటిక్ టర్ఫ్ ఏర్పాటుకు రూ. 6 కోట్లు నిధులు విడుదల అయ్యాయని టర్ఫ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఖెలో ఇండియాకు పంపాలని సూచించారు. 

పెద్దగుడెం గ్రామ శివారులో 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన చైర్మన్, జిల్లా కలెక్టర్ మిని స్టేడియం ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయని, స్థలం కొలతలు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్యను ఆదేశించారు. ఇదే గ్రామంలో మరో చోట మరో 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. రానున్న కాలంలో దేశంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు వనపర్తి జిల్లాలోని క్రీడా మైదానాలు ఉపయోగపడే విధంగా జిల్లాలోని క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు క్రీడా మైదానాలు చాల ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. మర్రికుంట వద్ద స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు మరింత స్థలాన్ని కేటాయిస్తామని తెలియజేశారు. 

స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, టెక్నికల్ డైరెక్టర్ చంద్రా రెడ్డి, కార్యనిర్వహక ఇంజనీరు అశోక్, పంచాయతీ రాజ్ శాఖ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, పీ. ఈ.టి. సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చైర్మన్ వెంట పాల్గొన్నారు.