- ఐవోసీకి భారత్ అధికారిక లేఖ
- ఒలింపిక్ కమిటీ నిర్ణయం 2025లోనే
- పోటీలో ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక 2036 ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్ నిర్వహణకు సమాయత్తమవుతోన్న భారత్ ఆ అడుగులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 2036 ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని తెలియజేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)కి భారత్ అధికారికంగా (లెటర్ ఆఫ్ ఇంటెంట్) లేఖను పంపినట్లు సమాచారం.
అక్టోబర్ 1వ తేదీనే భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఈ లేఖను పంపినట్లు తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్‌కు లాస్ ఏంజిల్స్ ఆతిథ్యమివ్వనుండగా.. 2032 విశ్వక్రీడలకు బ్రిస్బేన్ ఆతిథ్యమివ్వనున్నట్లు ఐవోసీ ఇది వరకే ప్రకటించింది. దీంతో 2036 ఒలింపిక్ ఆతిథ్య హక్కులను ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. ఇప్పటికే ఒలింపిక్ ఆతిథ్య హక్కులకు సంబంధించిన బిడ్‌ను ఐవోసీకి పంపించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఒక అడుగు ముందుకేసిన భారత్ ఐవోసీకి ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను పంపించింది. 2025లో ఐవోసీ అధ్యక్ష ఎన్నికల అనంతరం 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశముంది. విస్తృత స్థాయిలో బిడ్డింగ్ కాకుండా ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఐవోసీ నాయకత్వ విభాగం ఆతిథ్య హక్కులను కట్టబెట్టనుంది.
తొలి అడుగు అక్కడే..
ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ సమయంలోనే భారత్ తాము ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధమంటూ ఐవోసీకి లేఖను రాసింది. అంతకముందు ఏడాది అక్టోబర్‌లో జరిగిన 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు ఒలింపిక్స్ నిర్వహించే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. ‘2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం. ఇది 140 కోట్ల భారతీయుల కల. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గం. దీనికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.
2036 ఒలింపిక్స్ కల భారత్‌లో సాకారమైతే ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి లభిస్తుందని భారత ఒలింపిక్ సంఘం భావిస్తోంది. ఇక 2036 ఒలింపిక్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు భారత్‌తో పాటు పోటీలో ఖతార్, సౌ దీ అరేబియా, టర్కీ దేశాలు ఉన్నాయి.
ఒలింపిక్ బిడ్ విజయవంతమైతే యోగా, ఖో ఖో, కబడ్డీ లాంటి గేమ్స్‌ను ప్రవేశపెట్టాలనే యో చనలో ఉంది. ఒలింపిక్స్ ఆతిథ్యం హక్కులు భారత్‌కు దక్కితే మాత్రం పోటీలను నిర్వహించేందుకు అహ్మదాబాద్ ముం దు వరుసలో ఉంది.
ఈ అవకాశాన్ని వదులుకునేందుకు ససేమిరా అంటోన్న భారత్ 2036 ఒలింపిక్ పోటీలు దక్కించుకోవాలని ఆశిద్దాం.