ధాన్యం సేకరణ క్రమబద్ధీకణకు ఓపీఎంఎస్
పీడీఎస్ బియాన్ని పక్కదారి పట్టిస్తే ఊరుకోం
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌లో వరి సేకరణకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిందని పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సివిల్ సప్లాయీస్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ధాన్యం సేకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వ్యవసాయ శాఖ ఆన్‌లైన్ వరి నిర్వహణ వ్యవస్థ (ఓపీఎంఎస్)తో పంట డేటాను పంచుకుం టుందన్నారు. ఇది రాష్ర్టంలో పండించే వరి రకాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా రైతుల ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేస్తామన్నారు.
సన్నరకం వరికి క్వింటాల్‌కు రూ.500 ప్రోత్సాహకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పౌరసరఫరాల శాఖ సమగ్ర అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ నిర్ధేశించిన మార్గదర్శకాలను అనుసరించి, సన్నరకం వరిని నిర్ధారించడానికి సిబ్బందికి శిక్షణ అందిస్తామన్నారు.
రైస్‌మిల్లర్లు తమ వ్యవహారాల్లో నిజాయతీగా ఉండాలని, ప్రభుత్వం న్యాయంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తే సహించేది లేదని మంత్రి మిల్లర్లను హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లను వివరిస్తూ క్యాబినెట్ సబ్‌కమిటీకి సవివరమైన నివేదికను సమర్పించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
మిల్లర్ల సమస్యలపై చర్చిస్తాం..
మిల్లర్ల సమస్యలపై స్పందించిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. వారి సమస్యలపై తాము అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులతో కూడిన నివేదికను తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తుందని ఆయన చెప్పారు.
పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ప్రభుత్వం, రైస్ మిల్లింగ్ పరిశ్రమల మధ్య ఉండాల్సిన పరస్పర సహకార ప్రాముఖ్యతను గుర్తించామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాలను సాధించడంలో మిల్లర్లకు పూర్తి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో గత పదినెలల్లో పౌరసరఫరాల శాఖ పునరుద్ధరణ జరిగిందని కొనియాడారు.