calender_icon.png 26 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీడీఏ ద్వారా క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సన్నహాలు

25-04-2025 10:16:28 PM

ఐటీడీఏ పీవో రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): వివిధ క్రీడలలో ప్రావీణ్యం ఉండి సరైన క్రీడా స్థలాలు లేక యువతీ యువకులు క్రీడల పట్ల మక్కువ చూపలేకపోతున్నారని తప్పనిసరిగా భద్రాచలం పట్టణంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని సుందరయ్య నగర్ లోని డిఆర్సిసి పక్కన  ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణాల నుంచి మొదలుకొని పల్లెల వరకు ఎక్కడ చూసినా ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పిల్లలు సరదాగా ఆటలాడుకుంటూ కనిపిస్తారని, కానీ భద్రాచలంలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతీ యువకులు చాలామంది ఉన్న వారు ఆటలు ఆడుకోవడానికి సరైన క్రీడా ప్రాంగణాలు  లేకపోవడం వలన ఎంతోమంది క్రీడాకారులు నిరుత్సాహానికి గురి అవుతున్నారన్నారు.

క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని సుందరయ్య నగర్ లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రీడా ప్రాంగణానికి అనువుగా ఉన్నది లేనిది సంబంధిత రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకొని తప్పనిసరిగా స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం సుందరయ్య నగరంలోని ఇందిరమ్మ కాలనీ సందర్శించి, సొంత భూమి ఉండి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చని అన్నారు. అనంతరం భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఆదివాసి గిరిజనుల మహనీయుల విగ్రహాలకు ఏమైనా మరమ్మత్తులు ఉంటే దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేసి తనకు సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ హరీష్, తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ నరసింహారావు, ఏ ఈ శివ, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.