అక్టోబర్ 10న ‘కంగువ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కథానాయకుడు సూర్య. ఆయన తెరపై కనపడి దాదాపు రెండేళ్లు పూర్తి కావచ్చింది. పీరియాడిక్ సినిమాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ‘కంగువ’ చిత్రీకరణ ఏడాదికి పైగానే సాగింది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రం కావడం విశేషం. సుమారు మూడు వందల కోట్ల వ్యయంతో రూపొందింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర సమాచారం తెలియ వచ్చింది. అదే ‘కంగువ’ సీక్వెల్.
ఇటీవల కాలంలో పలు భారీ సినిమాలు రెండు మూడు భాగాలుగా తెరమీదికి వస్తున్న వైనం తెలిసిందే. సూర్య నటించిన ఈ సినిమా సైతం రెండో భాగం ఉందని సమాచారం. దర్శక, నిర్మాతలు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారని తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం వెచ్చించనున్నారట. 2026 ఆరంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాని అదే ఏడాది చివర్లో విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. ‘కంగువ’లో భీకరమైన పోరాట యోధుడిగా నటించిన సూర్య, 13 విభిన్న పాత్రల్లో కనపడనున్నారట. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను దాదాపు 30 భాషల్లో విడుదల చేయనున్నారట నిర్మాతలు.