calender_icon.png 14 March, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన భద్రాచల రామయ్య కళ్యాణం పనులు

14-03-2025 05:35:22 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కల్యాణానికి లాంచనంగా పనులు మొదలయ్యాయి. హొలీ పౌర్ణమి పురస్కరించుకుని ఈసారి కూడా ఉత్తర ద్వారo వద్ద పసుపు కొట్టి, స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు,ముత్తైదువ మహిళలు... శ్రీసీతారాముల కల్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 30  నుండి ఏప్రిల్ 12  వరకు  జరగనున్నాయి. ఏప్రిల్ 6 న  సీతారాముల కల్యాణం, ఎప్రిల్ 7 న రామయ్య కు  పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా  జరగనున్నాయి. అయితే సీతారాముల కల్యాణంలో ఎంతో  ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం శుక్రవారం నిర్వహించారు.  సీతారాముల ఉత్సవ మూర్తులకు  ప్రత్యేక పూజలు అనంతరం పసుపుకొమ్ములు దంచే కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చక స్వాములు, మాహిళలు. ముందుగా పసుపుకొమ్ములు దంచే కార్యక్రమం నిర్వహించే వైదిక బృందం సతిమణులు పసుపుకొమ్ములు దంచి పసుపును తయారు చేశారు.

అయితే  అనంతరం అత్తర్, గులాల్, బుక్క, పసుపు, కుంకుమ, పన్నీర్ వంటి సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను మహిళలు సిద్ధం చేసారు. కళ్యాణాలలో వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉండటం సహజం కానీ ఒక్క భద్రాద్రి క్షేత్రంలో ఈ సీతారాముల కల్యాణానికి  మాత్రమే తలంబ్రాలు గులాబీ రంగులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. తానిషా కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. డోలోత్సవం, వసంతోత్సవలతో రామయ్యాను పెళ్ళికొడుకును చేసినట్లుగా ఇక్కడి భక్తులు భావిస్తారు. స్వామివారి తలంబ్రాలు కలపడానికి యావన్మంది భక్తజనం ఉదయం నుండి చిత్రకూట మండపం ఎదుట పడిగాపులు పడి మరీ వేచివున్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులను అందరిని స్వామివారి తలంబ్రాలు కలపడానికి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులతో మిథిలా స్టేడియం ప్రాంగణం అంతా భక్త జనంతో  నిండిపోయింది.