calender_icon.png 15 November, 2024 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ సర్వీసెస్ ముసుగులో నకిలీ సర్టిఫికెట్ల తయారీ

15-11-2024 01:12:57 AM

  1. ఆరుగురు ముఠా సభ్యులను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు
  2. వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై సుధీంద్ర

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): నగరంలో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాల యంలో గురువారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై సుధీంద్ర కేసు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ కలాసిగూడలో ‘ఆర్‌ఎస్ ఆన్‌లైన్ సర్వీసెస్’ నిర్వహిస్తున్న నిందితులు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని అవసరమున్న వారికి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తున్నారు. మొదటగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఓటర్ ఐడీ కార్డు పొంది, దానితో ఆధార్‌కార్డు తీసుకుంటున్నారు.

అలా ఆధార్‌కార్డుతో పాస్‌పోర్టులను సమకూరుస్తున్నారు. కొన్ని పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం అవసరమున్న నేపథ్యంలో ముఠాలోని కొందరు సికింద్రాబాద్‌లోని కలాసిగూడ బాయ్స్ హాస్టల్ హెడ్‌మాస్టర్ దయానంద్, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డీ శ్రీహర్ష దాసరి, గాంధీ హాస్పిటల్ ఆర్‌ఎండీ జనార్ధన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ చాంద్ మౌలా పేర్లతో నకిలీ స్టాంప్‌లు తయారు చేయించి,

వారి అనుమతులు లేకుండానే ఫోర్జరీ చేస్తున్నారు. ఈ ముఠా దాదాపు పదేండ్ల నుంచి నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది ఓ కేసులో ఈ ముఠా లోని ఇద్దరు సభ్యులు నేరెడ్‌మెట్ పోలీసులకు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అప్ప టివరకు తన వద్ద ఉన్న డాటాను ముఠా సూత్రధారి స్మాష్ చేశాడు.

తాజాగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్‌ఎస్ ఆన్‌లైన్ సర్వీసెస్ సెంటర్‌పై దాడి చేసి ముఠా సభ్యుల ఆన్‌లైన్ సెంటర్ యజమాని ఏల్గం రాజ్ కుమార్(42), ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌కు సహకరిస్తున్న ఎల్బీనగర్‌కు చెందిన ఎండీ మహబూబ్(25), కంప్యూటర్ ఆపరేటర్లు రాచమల్ల విజయలక్ష్మి(39), కురాపాటి పల్లవి (32), పాస్‌పోర్ట్ ఏజెంట్ బండి శంకర్ (48), జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న గిరిరాజ్ అనిల్ కుమార్ (27)ను అరెస్ట్ చేశారు.

వారి నుంచి557 ఓట ర్ ఐడీ కార్డులు, 300 ఓటర్ ఐడీ ప్రి ప్రింటెడ్ కార్డులు, నకిలీ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన 180 డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ముఠాకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు ఉండటం గమనార్హం.