calender_icon.png 25 April, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిట్టగోడ కూలి గర్భిణి మృతి

24-04-2025 10:27:55 PM

బుదేరా చౌరస్తాలో గల తాజ్ రెస్టారెంట్లో ఘటన..

మునిపల్లి: మండలంలోని బుధిరా చౌరస్తాలో గల ఓ రెస్టారెంట్ లో పిట్టగోడ కూలి రేకులపై పడడంతో ఓ గర్భిణి మృతి చెందిన సంఘటన బుదేరా చౌరస్తాలో గురువారం నాడు జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన మన్నె విజయ్ కుమార్ వికారాబాద్ జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన శ్రావణి(22) తో గత సంవత్సరం క్రితం పెళ్లి అయింది. అయితే ఆమె ఇటీవల గర్భం దాల్చడంతో గురువారం నాడు సదాశివ్పేటలో స్కానింగ్ సెంటర్ కు స్కానింగ్ చేసుకునేందుకు తన భర్తతో కలిసి వెళ్లింది.

స్కానింగ్ చేసుకొని స్వగ్రామైన పోల్కంపల్లి గ్రామానికి వస్తున్న క్రమంలో భోజనం చేద్దామని ముదిరిలోని తాజ్ రెస్టారెంట్ కు వెళ్లారు. అప్పటికే గాలి వానతో కూడిన వర్షం కురుస్తుండడంతో రేకులపై ఉన్న పిట్టగోడ ఒక్కసారిగా గర్భిణి శ్రావణి పై పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న భర్త విజయ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో శ్రావణిని సదాసిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విజయ్ కుమార్ కు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృత దేహాన్ని సదాశిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. కాగా మృతురాలు నాలుగు నెలల గర్భవతి మృతి చెందడంతో పోల్కంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.