calender_icon.png 19 January, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి

17-07-2024 04:45:28 AM

  • కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు 
  • త్వరలో జిల్లాలవారీగా తనిఖీలు 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అందిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మంగళవారం డీజీపీ మాట్లాడుతూ.. ఆయా జిల్లాలు, కమిషనరేట్లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని నిర్దేశించారు.

ఈ సమస్యలను సమర్థంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పారు. పోలీస్‌స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని చెప్పారు. తనతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతామనని వెల్లడించారు.

హిస్టరీ షీట్‌లను సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని, శాంతి భద్రతలు మెరుగైన నిర్వహణ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు.