వైస్ ఛాన్స్‌లర్లుగా బీసీలకు అవకాశం కల్పించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 29: త్వరలో చేపట్టబోయే యూనివర్సీటీ వైస్ ఛాన్స్‌లర్ల నియామకాల్లో 50 శాతం బీసీలనే నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కోటా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్యల నేతృత్వంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూనివర్సీటీలలో ఖాళీగా ఉన్న 2400 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో చైర్మన్, డైరెక్టర్ నియామకాల్లో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలక మండలిని ప్రకటించాలన్నారు. ఈ ఏడాది 100 గురుకులాలు, 50 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు యూనివర్సీటీలు ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, గొరిగె మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.