19-03-2025 04:55:29 PM
టీడబ్ల్యూజేఎఫ్ వినతితో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హామీ
ఇండ్ల స్థలాలు లేని చోట 'బెడ్రూంలు' ఇచ్చేందుకు కృషి
మంచి సూచనని ఫెడరేషన్ నేతలకు కలెక్టర్ అభినందనలు
నేటి నుంచి జర్నలిస్టుల కోసం రేషన్ కార్డుల డ్రైవ్
కలెక్టరేట్ మీసేవ కేంద్రం ద్వారా అప్లికేషన్స్ : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి...
ఖమ్మం (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూంలను ఆయా మండలాల్లోని జర్నలిస్టులకు కేటాయించాల్సిందిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) చేసిన విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సానుకూలంగా స్పందించారు. మంచి సూచన చేశారంటూ ఫెడరేషన్ నేతలను అభినందించారు. కొణిజర్ల మండలం తనికెళ్ల ఉన్నత పాఠశాల సందర్శనకు బుధవారం వెళ్లిన కలెక్టర్ ను టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరు కూడా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మేలు చేసే విధంగా చర్యలు తీసుకోగలరని కోరారు.
మండలాల్లో ఇండ్ల స్థలాలు అందుబాటులో ఉంటే వాటిని కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూంలను జర్నలిస్టులకు కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ స్పందించారు. చాలా మంచి సూచన.. కచ్చితంగా ఈ దిశగా ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని వివిధ మండలాల్లో అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూంల వివరాలను కలెక్టర్ కు వినతిపత్రంతో పాటు సమర్పించడంతో ఇండ్ల స్థలాలు అందుబాటులో లేని చోట డబుల్ బెడ్రూంల కేటాయింపుల్లో జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లాకు 8,956 ఇండ్లు మంజూరు అయ్యాయని, 7,229 టెండర్ల కేటాయింపు కాగా 6,107 నిర్మాణాలు పూర్తయ్యాయని, 5,581 ఇండ్లు కేటాయించగా... ఇంకా 655 నిర్మాణ దశలో ఉన్నాయని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు వివరించారు.
వీటితో పాటు నిర్మాణం పూర్తయిన 526 ఇండ్లు, 467 టెండర్లు పూర్తయి ఇండ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉందని వీటన్నింటిలోనూ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో కలెక్టర్ అంగీకరించారు. కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండల్ రావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, స్వేచ్ఛ సాగర్, సుభాన్, రవి, శరత్ తదితరులు ఉన్నారు.
నేటి నుంచి జర్నలిస్టుల కోసం రేషన్ కార్డుల డ్రైవ్..
టీడబ్ల్యూజేఎఫ్ నేతల విజ్ఞప్తి మేరకు గురువారం నుంచి జర్నలిస్టుల రేషన్ కార్డుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పిన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ లో బుధవారం తనను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలతో అదనపు కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ ఐడీవోసీ (కలెక్టరేట్) మీసేవ కేంద్రం ద్వారా జర్నలిస్టులు గురు, శుక్ర, శనివారాల్లో అప్లికేషన్ చేసుకుంటే వెంటనే ఆ దరఖాస్తులను పరిశీలించి రేషన్ కార్డు ఇచ్చేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఆన్ లైన్ అయిన వెంటనే తహశీల్దారు, డీఎస్ వో జాప్యం లేకుండా అప్రూవ్ చేసేలా చూస్తామన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదని సూచించారు.
మీ సేవ కేంద్రాల అక్ నాలెడ్జ్మెంట్ తీసుకు వస్తే వెంటనే రేషన్ కార్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేర్పులు, మార్పుల వంటివి ఉంటే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని సంబంధిత చర్యలనూ వెంటనే చేపడుతామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండల్ రావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, సీవీఆర్ శ్రీనివాస్, వెగినాటి మాధవరావు, కూరాకుల గోపీ, మానుకొండ రవికిరణ్, స్వేచ్ఛ సాగర్, సుభాన్, మధుసూదన్, పీటీఐ నాగేశ్వరరావు, ఉపేందర్, అర్షద్, కిరణ్, గణేష్, రవి, శరత్ తదితరులు ఉన్నారు.