చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి
వికారాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): దేశంలోనే తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న కులగణన.. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి, రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.
శనివారం వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో కులగణనపై విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరైన మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలకు, వెనుకబడిన వర్గాలకు ఎంతోమేలు చేస్తుందన్నారు.
అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి పటోళ్ల రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నా రని మండిపడ్డారు. వచ్చే ఏడాది నాటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దింపేస్తామన్న మహేశ్వర్ రెడ్డి.. ముందు బీజేపీ శాసనసభా పక్ష నేత పదవి పోకుండా కాపాడుకోవాలన్నారు.
బీజేపీ నాయకులకు, ఆ పార్టీకి ఇతర పార్టీ ముఖ్యమంత్రులను పదవి నుంచి దింపే పనితప్ప మరో పనిలేదని విమర్శించారు. తెలంగాణలో మరో పదేళ్ల పాటు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉంటారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇక్క డి బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నట్లు ఆరోపించారు. కులగణనతో బీసీలకు మేలు జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.