calender_icon.png 23 October, 2024 | 8:49 AM

వర్షాకాలం ఇబ్బందులకు ముందస్తు చర్యలు

11-07-2024 12:04:07 AM

వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద సంపులు ఏర్పాటు

అనువైన స్థలాలను పరిశీలించిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): నగరవాసులు వర్షాకాలం ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వానకాలం నీరు నిలిచే ప్రాంతాల్లో (వాటర్ లాగింగ్ పాయింట్) సంపులను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం ముందుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధిలో రూ.20 కోట్లతో 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ బుధవారం క్షేత్రస్థాయిలో అనువైన స్థలాల కోసం ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీసు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువగా నీరు నిలిచే 140 చోట్ల సంపులను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సంపులకు అనువైన స్థలాలను గుర్తించాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంపుల నిర్మాణం ఎందుకంటే..

వర్షం కురిసిన సమయంలో వాటర్ లాగింగ్ పాయింట్లలో నీరు ఎక్కువగా నిలిచిపోతుంది. ఈ సమస్యను అధిగమిం చడానికి ఆయా ప్రాంతాల్లో సంపులను నిర్మిస్తున్నారు. ఇందులో ఆ వర్షం నీటిని సేకరించి, అనంతరం సమీపంలోని నాలాల్లోకి డంప్ చేస్తారు.