25-02-2025 06:36:46 PM
భీమారం మండల వ్యవసాయాధికారి సుధాకర్...
చెన్నూర్ (విజయక్రాంతి): రైతులు వారు సాగు చేస్తున్న పంటలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే రోగాలు, తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చునని భీమారం మండలం వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని ఖాజీపల్లి, అంకుషాపూర్ గ్రామా శివారులో రైతులు సాగు చేస్తున్న పెసర, వరి పంట క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. రసం పీల్చే పురుగుల నుంచి పెసర పంటను కాపాడుకునేందుకు రైతులు ముందుగానే గుర్తించి పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల పంట నష్టాన్ని తగ్గించవచ్చునని అన్నారు.
పెసర పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతిని నివారించేందుకు ఒక మిల్లీ లీటరు ఇమిడా క్లోప్రిడ్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయడం ద్వారా, లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించవచ్చునన్నారు. అలాగే వరిలో జింక్ లోపం అధికంగా ఉందని, దీని నివారించేందుకు ఎకరానికి 100 గ్రాములు చెలామిన్ జింక్ (12 శాతం ఈడీటీఏ)ను 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేయడం ద్వారా అరికట్టవచ్చునని సూచించారు. ఆయన వెంట వ్యవసాయ విస్తరణ అధికారి అరుణ్ కుమార్, రైతులు తదితరులున్నారు.