21-04-2025 02:07:55 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2౦ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు వీలుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆసక్తి మేరకు ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే జిల్లాకు 20 నుంచి 30 పాఠశాలల్లో వీటిని ఈ విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రైవేట్‌లో చేరేవారి సంఖ్య ఎక్కువగా, సర్కార్ బడుల్లోని ప్రవేశాల సంఖ్య తక్కువగా ఉంటోంది. యేటా ప్రైవేట్‌లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూపోతుంటే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుతోంది.
ఈక్రమంలోనే ఈ విద్యాసంవత్సరం నుంచైనా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించడం ద్వారా పేద విద్యార్థులకు ప్రీప్రైమరీ తరగతులు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశమూ ఏర్పడుతుంది.
సర్కార్ బడులకు పూర్వవైభవం
రాష్ట్రంలో 18,259 ప్రాథమిక పాఠశాలలుంటే అందులో 50 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు 6 వేలు మాత్రమే. మిగతా స్కూళ్లలో అంతకంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారు. ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణ ద్వారా ఆయా స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెరుగుతోంది. మళ్లీ సర్కారు బడులకు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలో అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 28 లక్షలున్న విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఇప్పుడు 18 లక్షలకు పడిపోయింది. విద్యార్థుల సంఖ్య పెంచాలంటే ప్రీప్రైమరీ విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ బడుల ప్రాంగణాల్లోని అంగన్‌వాడీ సెంటర్లలో పూర్వప్రాథమిక తరగతులను నడిపిస్తున్నారు.
కొత్తగా అమలు చేయబోయే ప్రీప్రైమరీ తరగతులకు ప్రత్యేకించి ఉపాధ్యాయులను నియమిస్తారో.. లేక ఉన్నవారినే కేటాయిస్తారో తేలాల్సి ఉంది. ఇప్పట్లో కొత్తవారిని నియమించడం సాధ్యమయ్యే పనికాదు. ఈ తరగతులను మహిళా ఉపాధ్యాయునులతో నిర్వహించాలని భావిస్తున్నారు. లేకుంటే విద్యావాలంటీర్లను నియమించి వారి సేవలను వినియోగించుకోనున్నారు.