- ఎన్‌రోల్‌మెంట్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
తల్లిదండ్రుల ఆసక్తిమేరకు ప్రీప్రైమరీ క్లాసులకు మొగ్గు
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): సర్కారు బడి మారుతోంది. తల్లిదం డ్రుల ఆసక్తి, డిమాండ్ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు త్వరలోనే రానున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రభుత్వ పాఠ శాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు.
ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూళ్ల తరహాలో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభు త్వం భావిస్తోంది. దీన్ని అమలు చేస్తే పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రెండున్నర, మూడేళ్ల నుంచే ఎల్‌కేజీ తరగతుల్లో చేర్పించేందుకు ఆసక్తిచూపుతున్నారు. అదే సర్కా రు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులు లేకపోవడంతో తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో వేస్తున్నారు.
దీంతో ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంటే, సర్కారు బడుల్లో మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఇదే విషయాన్ని సీఎం పలు వేదికల్లో చెప్పారు. సర్కారు బడులపై పేరెంట్స్‌కు నమ్మకం సన్నగిల్లుతోంది.. అందుకే ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రా ల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలంటే గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం అం దించేవిగా మాత్రమే పేరెంట్స్ చూస్తున్నారు. అక్కడ పెద్దగా అర్హతలున్న టీచర్లు లేకపోవడంతో వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతుల్లో చేర్పిస్తున్నారు.
ఈ తరగతులు ఇప్పటికే అంగన్‌వాడీల్లో అమలవుతుండటంతో వీటిని కొనసాగించాలా? లేక పౌష్ఠికాహారం వరకే పరి మితం చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అమల్లోకి తీసుకురావాలా? అన్న విషయం పై ఆలోచిస్తోంది. ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ తరగ తులు ప్రారంభించేందుకు ఇప్పటికే సరిపడా అధ్యాపకులున్నారని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.