17-04-2025 07:22:12 PM
ఉద్యోగ భద్రత కల్పించండి..
పార్ట్ టైం అధ్యాపకుల డిమాండ్..
కామారెడ్డి (విజయక్రాంతి): తాత్కాలిక అధ్యాపకుల (పార్ట్ టైం) సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ తాత్కాలిక అధ్యాపకులు నిన్న తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసే క్రమంలో వారిని ముందస్తు అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ సందర్భంగా తాత్కాలిక అధ్యాపకులు మాట్లాడుతూ... తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసును పరిగణలోకి తీసుకొని రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో తమకు అదనపు వెయిటేజీ ఇవ్వాలని అన్నారు. న్యాయమైన డిమాండ్లను సెక్రటేరియట్ సాక్షిగా అడగడానికి వెళ్లే మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు.
అధ్యాపకుల అరెస్టును నిరసిస్తూ దక్షిణ ప్రాంగణంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ర్యాలీని తీసి అధ్యాపకులను వెంటనే వదిలిపెట్టాలి నినాదం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలోని తాత్కాలిక అధ్యాపకులకు 50 వేలతో కూడిన 12 నెలల వేతనం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం తగదని వాపోయారు. జీవో 21ను తీసుకువచ్చి గత కొన్ని దశాబ్దాల కాలంగా వివిధ విభాగాలలో అరకొర జీతాలతో పనిచేస్తున్న తమకు కనీసం తమ సర్వీసును పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలను చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. అరెస్టులను నిరసిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ కార్మిక విభాగం స్టేట్ ప్రెసిడెంట్ సందుగారి రవీందర్ రెడ్డి మద్దతు తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ముందస్తు అరెస్టులు చేసిన అధ్యాపకులలో డా. సునీల్ కుమార్, శ్రీకాంత్ గౌడ్, విజయ్ కుమార్ ఉండగా, భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో డా. ఇంద్రకరణ్ రెడ్డి, డా.కనకయ్య, డా. శ్రీను కేతవత్, పోతన, బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో డా. ఆఫ్రిన్ బేగం ఉన్నారు.