calender_icon.png 23 September, 2024 | 4:49 AM

పీఆర్సీ మరింత ఆలస్యం!

23-09-2024 02:50:00 AM

  1. మరో 6 నెలలు సమయం పట్టే అవకాశం 
  2. ఈ నెలాఖరుతో ముగియనున్న కమిషన్ గడువు 
  3. మరో ఆరు నెలలు పొడిగించే యోచన

ఇప్పటికే శాఖలు, ఉద్యోగ సంఘాలతో భేటీలు 

త్వరలో ఆర్థిక శాఖతో పీఆర్సీ కమిషన్ సమావేశం 

ఆ తర్వాతే ప్రుభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక 

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లుకు సంబంధించిన వేతన సవరణకు మరింత సమయం పట్టే అవకాశముంది. ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు పీఆర్సీ కమిషన్ మరికొంత సమయం తీసుకోనుంది. నివేదిక సమర్పణకే మరో మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.

దీంతో కమిషన్ గడువును మరోసారి పొడిగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఉద్యోగుల వేతన సవరణ సిఫారసుల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను 2023 అక్టోబర్ 2న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్‌గా, మరో రిటైర్డ్ ఐఏఎస్ బీ రామయ్య సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇది రెండో పీఆర్సీ కమిషన్. ఆరు నెలల్లో ఈ కమిషన్ పూర్తి నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. 

మరోసారి గడువు పొడిగింపు

కమిషన్ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. అప్పుడు దీని గడువును ఆరు నెలలు పొడిగించారు. ఈ గడువు కూడా ఈ నెలాకరుతో ముగియనుంది. దీంతో మారోసారి గడువును పొడిగించే అవకాశం ఉన్నది. అక్టోబర్ నెలతో పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటుచేసి ఏడాది పూర్తి కానుంది. ఇంతవరకూ కమిషన్ నివేదికను సమర్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

త్వరలో ఆర్థిక శాఖతో భేటీ

పీఆర్సీ కమిషన్ సంప్రదింపులు పూర్తి కావొచ్చాయి. ముందుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి నుంచి ప్రతిపాదనలను స్వీకరించింది. ఆ తర్వాత మళ్లీ ఒక్కో సంఘం సమర్పించిన ప్రతిపాదనలపై వివరణ కూడా తీసుకుంది. అనంతరం ప్రభుత్వ శాఖలతోనూ కమిటీ సంప్రదింపులు జరిపింది. అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఒక్క ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపటమేనని అధికారిక వర్గాలు తెలిపాయి. త్వరలోనే వారితో కమిషన్ సమావేశం కానుంది. ఆ తర్వాత ఫిట్‌మెంట్ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకొని పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయనున్నది. ఇంతవరకు జరిపిన సం ప్రదింపులకు సంబంధించిన నివేదిక రూపకల్పన తుది దశలో ఉంది.

నివేదికను బహిర్గంతం చేయాలి

2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. నూత న పీఆర్సీలో ప్రభుత్వం అంగీకరించిన ఫిట్‌మెంట్ మొత్తాన్ని 2023 జూలై 1 నుంచి చెల్లించాలి. వీటిని పీఆర్సీ బకాయిలుగా పిలుస్తారు. ఇప్పటికే పీఆర్సీ ప్రకటించడం ఆలస్యం కావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి, మెరుగైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాని డిమాండ్ చేస్తున్నాయి.