calender_icon.png 4 April, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రార్థన హృదయగానం

23-03-2025 12:00:00 AM

శుద్ధపురుషులు తాము సాధించుకున్న లేదా సహజంగా పొంది న సిద్ధులను తమ కోసం ఎన్నడూ వాడుకోరు. మేఘం తన వద్దనే వున్న నీటితో దాహం తీర్చుకోదు. ఆవు తన పాలను తాను తాగదు. సిద్ధపురుషులంతా తమ సంకల్పాల ను, సిద్ధులను లోక కళ్యాణం కోసం, లోక శోకాన్ని తొలగించటానికి మాత్రమే వినియోగి స్తారు.

భగవత్పాదులు తమ బాల్యంలో భిక్షాటనకు వెళ్ళినపుడు ఒక నిరుపేద గృహిణి ఇంటి ముందు, భిక్షనర్థించినపుడు, ఆమె తన అశక్తతను, పేదరికాన్ని వ్యక్తపరచినపుడు, ఇంటవున్న ఎండిన ఉసిరికాయ తప్ప సమర్పించుకోవటానికి మరొక వస్తువే లేదని విలపించినపుడు, కరుణాలయమైన శంకర హృదయం ఆర్ద్రమైంది. మనసు సంకల్పించింది. అమృత వాక్ప్రవాహం ఆశువుగా సర్వైశ్వర్య దాయినియైన శ్రీమహాలక్ష్మిని స్తుతించింది. ప్రార్థించింది. శంకరులే అర్థిస్తే అమ్మ కదలదా? కరగదా? కనికరించదా? అదే జరిగింది. కనకధార సాగింది.

శంకర దేహం పూజించింది. శంకర మనసు స్తుతించింది. శంకర హృదయం పరవశించింది. బీద ఇల్లాలి ఇల్లు సర్వసంపదాలయమైంది. ఆమె దీనత్వం లయించింది. దివ్యత్వం పల్లవించింది. ఆనందం వెల్లివిరిసింది. ఆనాటి శంకర హృదయగీతికే ఈనాడు ఆరాధనా గీతికగా, జనుల నాల్కలపై నడయాడే దివ్యగానమైంది. శ్రీమహాలక్ష్మిని ఎట్లా ప్రార్థిస్తే, ఏమని అర్థిస్తే ఆమె అనుగ్రహిస్తుందో, పేదరికం నశించి పెద్దరికం లభిస్తుందో సూచించే కనక ధారా స్తవం దివ్యకవితా మాలికైంది.

శ్రీ శంకర భారతి

నీ కనుకొలకుల మెరిసే మెరుపు 

శ్రీ మహావిష్ణువుకు మైమరపు,

నీ చూపులు బారులు కట్టి 

హరివదనాన్ని మనోహరం చేస్తయ్,

నీ కడగంటి చూపు 

శ్రీహరికి ఆనంద కారకం,

నీ అరమోడ్పు కన్నులకాంతి 

విష్ణువుకు పారవశ్యం 

కలిగిస్తుంది. ఆ చూపే 

నాకు కలిమిని అనుగ్రహిస్తుంది.

నీ చూపులు పరమాత్మ కామననే తీర్చగలిగినపుడు, 

నాకూ మంగళాన్ని అనుగ్రహిస్తయ్.

నీ రూపం, నీలిమబ్బుల ఒదిగిన ఇంద్రాణివలె, నాకు శుభ్రకాంతిని వరదానం చేస్తుంది.

పాలసముద్రంలో పుట్టిన పావనివి నీవు. నీ ఉనికితో హరి హృదయం రస హృదయం అయింది. నీ దయ నాపై ఎందుకుండదు? పాప, తాప, శాపమయమైన నా జీవితంపై, నీ దయతో, సంపద అనే వర్షం కురియాలి. ముగురమ్మల మూలపుటమ్మవు నీవు. నీకు నమస్సులు. నీవు శృతివి, రతివి, తుష్టివి, పుష్టివి. నీకు వందనం.

నీవు పద్మముఖివి. పాల సముద్రం నీ పుట్టిల్లు. చంద్ర సోదరివి. అమృతమూ నీ తోబుట్టువే. అంతా తెలుపే. తెలిపేదే. అమ్మా! నీకు నమస్కారం. ముల్లోకాల కల్లోలాన్ని ఆపి ఆనందం పూయించే తల్లీ, నన్నూ అనుగ్రహించు. లోక సుఖమూ, పర సుఖమూ ఎరుగని కడు బీదను నేను. నిన్నే నమ్మిన నేను, నీ దయకు పూర్తిగా అర్హుణ్ణి.నీ దయారసంతో నన్ను కాపాడు. వేదమే నీ రూపం. మూడు లోకాలకు తల్లివి నీవు. అగణిత గుణమణివి నీవు. నిన్ను ఆరాధిస్తే నాయందు సద్గుణాలు అధికమవుతాయి. పండితుల, విద్వాంసుల ప్రశంసలు పుష్కలంగా లభిస్తాయి.

భగవత్పాదులు లోకశంకరులు. కన్నీరు తుడిచి ఆనందం అనుగ్రహించే దయాస్వరూపమది. కడుపు నిండాలి, మనస్సు పం డాలి. అపుడే జీవుడి హృదయం పరమేశ్వరునిపై లగ్నమవుతుంది. ప్రాపంచిక సంప దలన్నీ పరమేశ్వరి అనుగ్రహమే. సత్కార్యాలకు వినియోగిస్తేనే సంపద పెరుగుతుంది. గుణ సంపద, దయ, సేవ, ప్రేమ, కరుణ మానవుడు పొందవలసిన అసలు సంప ద. పరుల ఆనందం కోసం చేసే ప్రార్థనే అసలు ప్రార్థన. అదే శుద్ధి. అదే సిద్ధి. ధన మే బలంగా మారిన ఆధునిక ప్రపంచానికి ఆచార్యస్వామి సందేశం ఇదే!