calender_icon.png 11 February, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాగ్‌రాజ్ ప్రయాణవెతలు

11-02-2025 01:13:52 AM

* ట్రాఫిక్‌తో నరకం చూస్తున్న ప్రయాణికులు

* కిక్కిరిసిన ప్రయాగ్ రాజ్ దారులు 

* ఫలించని అధికారుల ప్రయత్నాలు

* పుణ్యస్నానమాచరించిన రాష్ట్రపతి

* శివరాత్రితో ముగియనున్న పుణ్యస్నానాలు

* ౪౫కోట్ల మార్కుకు చేరువలో..  పుణ్యస్నానాల సంఖ్య

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 10: మహాకుంభమేళాకు భక్తజనం పోటెత్తారు. దీంతో కిలోమీ టర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చాలా మంది భక్తులు గంటలకొద్దీ ట్రాఫిక్‌లో గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు.

వసంత పంచమి ముగిసిన తర్వాత కుంభమేళాకు భక్తుల తాకిడి తగ్గుతుందని అంతా ఊహించారు. కానీ భక్తుల సంఖ్య ఊహించినదాని కంటే ఎక్కువగా ఉంటోంది. దీంతో గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రయాగ్‌రాజ్ దగ్గర్లో ఉన్న జిల్లాల పోలీసులు మాట్లాడుతూ... కుంభమేళాకు వెళ్లే అన్ని దారులు ట్రాఫిక్‌తో కిక్కిరిసాయని పేర్కొన్నారు. అక్కడ 200 కిలోమీటర్ల మేర జామ్ అయినట్లు అంచనా వేస్తున్నారు. 

చాలా రోడ్లున్నాయి.. 

ఓ మోటారిస్ట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కుంభమేళాకు చేరుకునేందుకు చాలా రోడ్లున్నాయి. కానీ అందరూ ఒకే రూట్‌లో వచ్చి జామ్‌కు కారణం అవుతున్నారు. అలా కాకుండా వేర్వేరు రహదారుల్లో వస్తే పరిస్థితి ఇలా ఉండదు’ అని తెలిపాడు. ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడానికి వీకెండ్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. వారాంతం కావడంతో అనేక మంది కుంభమేళా వెళ్లేందుకు మొగ్గుచూపారు. దీంతో వాహనాలు బారులు తీరాయి. మహాకుంభమేళాలో పుణ్య స్నానమాచరించిన భక్తుల సంఖ్య ౪౫ కోట్లకు చేరువలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.  

పుణ్యస్నానమాచరించిన రాష్ట్రపతి ముర్ము

మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పుణ్యస్నానమాచరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అంతకు ముందు రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన రెండో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యూపీ సీఎం తదితరులతో కలిసి బడే హనుమాన్ ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

యోగి అట్టర్‌ప్లాప్

మహాకుంభమేళాకు అనేక మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ఏర్పాట్లు చేయడంలో యోగి సర్కారు విఫలం అయింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అనేక మంది మంత్రులు కనిపించడం లేదు.

 అఖిలేష్ యాదవ్, ఎస్పీ అధినేత

రాబోయే రెండు రోజుల పాటు యాత్రికులెవరూ ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లొద్దు..

 మోహన్ యాదవ్,  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి