- హైజంప్ టీ ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్‌కు పసిడి
- భారత్ ఖాతాలో 26వ పతకం
ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్ చివరి దశకు చేరుకున్నప్పటికీ మన అథ్లెట్లు మాత్రం పతకాలతో సత్తా చాటుతూనే ఉన్నారు. తాజాగా దేశం ఒడిలో మరో స్వర్ణం వచ్చి వాలింది. టోక్యోలో హైజంప్ విభాగంలో రజతంతో మెరిసిన ప్రవీణ్ కుమార్ పారిస్‌లో రికార్డు ప్రదర్శనతో పసిడి పట్టాడు. ఈ పతకం భారత్ ఖాతాలో 26వది కాగా.. స్వర్ణాలు సంఖ్య ఆరుకు చేరింది. పారాలింపిక్స్ పోటీలకు మరో రెండు రోజులు మిగిలి ఉండడంతో మన అథ్లెట్లు పతకాల సంఖ్యను 30 దాటిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
విజయక్రాంతి ఖేల్ విభాగం: పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. హై జంప్‌లో ఇప్పటికే రజతం, కాంస్యం రాగా.. తాజాగా స్వర్ణం మన ఖాతాలో చేరింది. శుక్రవారం జరిగిన హై జంప్ టీఱూ64 ఫైనల్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ (2.08 మీటర్లు) దూకి పసిడి పతకం దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ప్రవీణ్ కుమార్‌దే అత్యుత్తమ హైజంప్ రికార్డు కావడం విశేషం. ఇక అమెరికా అథ్లెట్ డెరెక్ లోసిడెంట్ (2.06 మీటర్లు), ఉజ్బెకిస్థాన్ అథ్లెట్ టెముర్‌బెక్ (2.03 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
1.89 మీటర్లతో తన ఆటను ప్రారంభించిన ప్రవీణ్ ఏడు మీటర్ల కంటే ఎక్కువగా ఎగిరి తొలి ప్రయత్నంలోనే పసిడి పతకాన్ని దాదాపు ఖరారు చేసుకున్నాడు. ఆ తర్వాత ఎత్తును 2.10 మీటర్లకు పెంచగా ప్రవీణ్, లోసిడెంట్ తొలిస్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఇద్దరు విఫలమయ్యారు. దీంతో 2.08 మీటర్లతో ప్రవీణ్‌కు స్వర్ణం ఖరారైంది. టోక్యో పారాలింపిక్స్‌లో ప్రవీణ్ రజతంతో మెరిశాడు. వరుసగా రెండో పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించిన ప్రవీణ్ ఈసారి పతక రంగును మారుస్తూ ఏకంగా స్వర్ణం కొల్లగొట్టడం విశేషం.
ఇక పారాలింపిక్స్ హైజంప్‌లో భారత్ తరఫున స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా ప్రవీణ్ రికార్డులకెక్కాడు. గతంలో తంగవేలు మరియప్పన్ ( రియో 2016 పారాలింపిక్స్) పోటీల్లో స్వర్ణంతో మెరిశాడు. కాగా ఈసారి పారాలింపిక్స్‌లో హై జంప్ విభాగంలో ఇది మూడో పతకం. ఇప్పటికే టీలూ విభాగంలో శరద్ కుమార్ (1.88 మీటర్లు), తంగవేలు ( 1.85 మీటర్లు) రజత, కాంస్యాలు దక్కించకున్నారు. ప్రవీణ్ స్వర్ణంతో భారత్ ఖాతాలో 26 పతకాలు ఉండగా.. ఇందులో ఆరు స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలున్నాయి.
ఎవరీ ప్రవీణ్ కుమార్?
నోయిడాకు చెందిన ప్రవీణ్‌కు పుట్టుకతోనే అంగవైకల్యం బారిన పడ్డాడు. ఒక కాలు చిన్నగా ఉండడంతో చిన్నతనం నుంచే కాస్త నిరాశభావంతో మెలిగేవాడు. ప్రవీణ్ తనలో ఆ భావాన్ని పోగొట్టుకునేందుకు క్రీడలవైపు ఆసక్తిని మళ్లించాడు. తొలుత వాలీబాల్ ఎక్కువగా ఆడేవాడు. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్ అతడి సామర్థ్యాన్ని గుర్తించి హైజంప్‌లో పోటీ పడమని ప్రోత్సహించాడు. సత్యపాల్ రాకతో ప్రవీణ్ కెరీర్ మలుపు తిరిగింది. 2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి తొలిసారి వెలుగులోకి వచ్చాడు.
ఆ తర్వాత 2021లో దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో స్వర్ణంతో సత్తా చాటాడు. అదే ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లో రజతంతో మెరిశాడు. 2022 ఆసియా పారా గేమ్స్‌లో 2.05 మీటర్లు దూకి ప్రపంచ రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టాడు. తాజాగా పారిస్‌లో ఆ రికార్డును కూడా బద్దలు కొట్టిన ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి సాధించి చరిత్రకెక్కాడు.