విదేశాంగశాఖతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): గల్ఫ్ వలస కార్మికులకు ఓదార్పు, మనోధైర్యం కల్పించేందుకు రాష్ట్రం ప్రభుత్వం ముందుకొచ్చింది. విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను వారి కుటుంబసభ్యులు విన్నవించేందుకు శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ని ప్రభుత్వం ప్రారంభించనున్నది. ‘ప్రవాసీవాణి’కి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమ ఏర్పాట్లను ఎన్నారై ప్రతినిధులు డాక్టర్ వినోద్‌కుమార్, మంద బీమ్‌రెడ్డి, బొజ్జ అమరేందర్‌రెడ్డి, గంగసాని నవీన్, చెన్నమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.