14-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): రెండేండ్లకు పైగా ఆస్తి పన్ను చెల్లించకపోవడం, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోవడంతో నగరంలోని కాచిగూడలో ఉన్న ప్రతిమ ఆస్పత్రి జీహెచ్‌ఎంసీకి రూ.43 లక్షల బకాయిలు పడింది. పన్ను చెల్లించాలని పలుసార్లు కోరినా ఆస్పత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఆస్పత్రిలోని కంప్యూటర్లు, పలు వస్తువులను సీజ్ చేసే ప్రయత్నం చేశారు.
అధికారులు తెలిపిన ప్రకారం జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోన్ అంబర్‌పేట సర్కిల్ పరిధిలోని కాచిగూడలో ఉన్న ప్రతిమ ఆస్పత్రి 2022, అక్టోబర్ నుంచి 2025, మార్చి వరకు రూ.37 లక్షల ఆస్తిపన్ను, రూ.6 లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఆస్పత్రికి ఫిబ్రవరిలో నోటీసులివ్వగా, మార్చిలో చెల్లిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.
కానీ మార్చిలోనూ బకాయిలు చెల్లించలేదు. దీంతో అధికారులు ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 10న నిర్వహించిన ప్రజావాణిలో తమ బకాయిలు తగ్గించాలని ఆస్పత్రి వర్గాలు విజ్ఞప్తి చేశాయి. దీంతో ఇటీవల జీహెచ్‌ఎంసీ ఇచ్చిన ఓటీఎస్ రాయితీ మేరకు అధికారులు రూ.3.5 లక్షల మినహాయింపు కల్పించారు.
మరో రెండు రోజులు సమయం కావాలని ఆస్పత్రి యాజమాన్యం అధికారులను కోరింది. సమయం గడిచినా బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగి ఆస్పత్రిలోని పలు కంప్యూటర్లు, వస్తువులను సీజ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో మరో 3 రోజులు సమయం కావాలని ఆస్పత్రి యాజమాన్యం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను కోరింది. అధికారుల సూచనల మేరకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సాయంత్రం అక్కడి నుంచి నిష్క్రమించారు.