calender_icon.png 23 December, 2024 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రసాదం వివాదం

21-09-2024 12:00:00 AM

కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఏడుకొండల వెంకన్నను దర్శించుకునే ప్రతి భక్తుడు లడ్డూను మహాప్రసాదంగా భావిస్తుంటారు. దీనికి ఎంతో పవిత్రతతో పాటుగా విశిష్టత కూడా ఉంది. వందల సంవత్సరాలుగా అన్ని ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ తయారు చేసే ఈ లడ్డూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడరు. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఈ లడ్డూప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు,చేపనూనె వంటివి కల్తీ అయినట్లుగా ల్యాబ్ నివేదిక ధ్రువీకరించిందని రెండు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి తెరదీశాయి.

కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాసుల కోసం కక్కుర్తిపడి తక్కువ నాణ్యత ఉన్న నెయ్యిని కొనుగోలు చేశారన్నది సీఎం ప్రధాన ఆరోపణ. చంద్రబాబు ఆరోపణలు  రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై తన కుటుంబంతో సహా వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమంటూ సవాలు విసిరారు.మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వివాదంపై స్పందించారు.

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కల్తీ నెయ్యి డ్రామా ఆడుతున్నారంటూ మండిపడ్డారు. సీఎం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటారా అంటూ దుయ్యబట్టారు. గత జులై 12న రెండు ట్యాంకర్లలోని నెయ్యి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకున్నారని, జులై 23న గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదిక వచ్చిందన్న ఆయన  చంద్రబాబే అప్పుడు సీఎంగా ఉన్నప్పటికీ ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. అయితే దీనిపై టీటీబీ బోర్డు ఈవో శ్యామలరావు సైతం స్పందించారు.

ల్యాబ్ పరీక్షల్లో నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు తేలిందని చెప్పారు. నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నామని, నాణ్యత లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపించామని, దీనిపై కమిటీ వేసి చర్యలు ప్రారంభించామని చెప్పారు. గతంలో నెయ్యిని కిలో రూ.320కే సరఫరా చేశారన్న శ్యామలరావు అంత తక్కువ ధరకు కొనుగోలు చేశారంటేనే నెయ్యి నాణ్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు తాము కర్నాటక డెయిరీనుంచినెయ్యిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. 

ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైంది? తిరుమల లడ్డూ తయారీకి రోజూ 300500 లీటర్ల ఆవునెయ్యిని ఉపయోగిస్తారు. 2021మార్చిదాకా టీటీడీకి కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ‘నందిని’ బ్రాండ్ నెయ్యిని సరఫరా చేసేది. 2021మార్చిలో జరిగిన టెండర్ ప్రక్రియలో అది ఎల్3 నిలిచింది. అయినా ఎల్1, ఎల్2 అనుమతితో అవసరమైన నెయ్యిలో 20 శాతంమాత్రం సరఫరా చేసింది. ఆ తర్వాతనుంచి టెండరు ప్రక్రియలో పాల్గొనలేదు. యూపీకి చెందిన రెండు కంపెనీలు టెండర్‌ను తక్కువ ధరకు దక్కించుకున్నాయి. అయితే ఈ ధర తమకు గిట్టుబాటు కాదని కర్నాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు.

అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యిని కొనుగోలు చేస్తున్నదంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజా వివాదం రాజకీయ రంగు పులుముకుంది.చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ సైతం దాఖలు చేసింది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై టీటీడీని సమగ్ర నివేదిక కోరింది. సీబీఐ విచారణ జరిపించాలంటూ జాతీయ స్థాయి బీజేపీ నేతలు సైతం డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.