14-02-2025 03:39:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు(Former DSP Dugyala Praneeth Rao)కు నాంపల్లి కోర్టు(Nampally Court) శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రణీత్ రావుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన కోర్టు, రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-2గా ఉన్న ప్రణీత్ రావు తో సహా రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు ఇప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు. 11 నెలలపాటు చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణీత్ రావు విచారణ కొనసాగింపు చర్యల్లో భాగంగా పోలీసులు కోర్టు ఎలాంటి ఆధారాలు దాఖలు చేయలేదు.
దీంతో విచారణ పెండింగ్ లో ఉందన్న విషయం అవాస్తవమని ప్రణీత్ రావు తరపు ఉమామహేశ్వరరావు న్యాయవాది వాదించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం (ఫిబ్రవరి 11) ఆయన తరపు న్యాయవాది 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూర్తి చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో విచారణను వాయిదా వేస్తూ జడ్జీ రమాకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఒక్కరే జైలులో ఉన్నారు. భుజంగరావు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.