యోగాలో ప్రాణాయామం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ప్రాణాన్ని పొడిగించే ఆసనాన్నే ప్రాణాయామం అంటారు. మనస్సును నియంత్రించడానికి అనుసరించే ముఖ్యమైన పద్ధతిలో ఇదొకటి. మనిషి ఎక్కువకాలం జీవించడానికి ప్రాణాయామం సహాయపడుతుంది.
ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. ఫిట్‌నెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎక్కువమంది శారీరక ఆరోగ్యంపైనే దృష్టిపెడతారు. కానీ మానసికంగా కూడా ఫిట్‌గా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యవంతులు అనిపించుకుంటారు. మనసును అదుపులో ఉంచడం, ఏకాగ్రతను సాధించడం అనేవి నాడీవ్యవస్థకు సంబంధించినవి.
ఇందులో అత్యంత కీలకమైన దశ శ్వాస. శరీరంలోని అన్ని వ్యవస్థలకు ఆక్సిజన్ అందించి అన్నింటినీ సక్రమంగా నడిపించే ప్రక్రియ శ్వాసక్రియ. అన్ని కణాలకు ఆక్సిజన్ సరఫరా జరగాలంటే శ్వాస మెరుగ్గా ఉండాలి. యోగా ద్వారా శ్వాసను నియంత్రించటం సాధ్యం అవుతుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైనప్పుడు శ్వాస వేగవంతం అవుతుంది.
దీంతో శరీరంలోని అడ్రినల్ గ్రంథుల్లో కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఈ ప్రభావంతో వివిధ వ్యవస్థలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. అలాంటప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకుంటే కార్టిసాల్ స్థాయిలను తగ్గించవచ్చు. తక్కువ కార్టిసోల్ ఉత్పత్తి అయిందంటే.. తక్కువ ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. కాబట్టి శ్వాస సరిగ్గా ఉండాలి. అందుకు చక్కటి మంత్రం ప్రాణాయామం.
ఉపయోగాలు
* కోపం, ఆవేశాన్ని తగ్గిస్తుంది.
* ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
* ప్రాణాయామంతో శ్వాస అదుపులో ఉంటుంది. మానసిక పరిస్థితి నియంత్రణలో ఉంటుంది.
* ఏకాగ్రతను పెంచుతుంది. పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* ప్రాణాయామంతో ఆటో ఇమ్యూన్ (స్వీయ రోగనిరోధక వ్యవస్థ) వ్యాధుల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.
* నిద్రలేమి ఉండదు. నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
* కొన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులు, మంటలు అదుపులో ఉంటాయి.
* ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.
* శ్వాసక్రియ మెరుగ్గా ఉంటుంది. శ్వాస సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి.
* ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది శరీరంలోని, రక్తంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.
-- అనిత అత్యాల,
అనిత యోగ అకాడమీ, 6309800109