11-03-2025 01:00:16 AM
నల్లగొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు
ఆరుగురికి యావజ్జీవం
* తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా స్పెషల్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు సుభాష్‌శర్మకు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ శిక్ష ఖరారుచేస్తూ సోమవారం న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెలువరించారు.
నల్లగొండ, మార్చి 10 (విజయక్రాంతి): మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్, అమృత 2018 జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. అమృత కుటుంబానికి ఈ వివాహం ఇష్టంలేకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అమృత మేజర్ కావడంతో ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో చెప్పింది.
అమృత కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని ఆమె తండ్రి మారుతీరావు 2018 సెప్టెంబర్ 18న సుపారీ గ్యాంగ్ సాయంతో అమృతతో కలిసి దవాఖానకు వెళ్లి వస్తున్న ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి 8 మందిపై కేసులు నమోదుచేసి దాదాపు 9 నెలలు శ్రమించి 1600 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు.
దాదాపు ఐడేండ్లపాటు విచారణ కొనసాగగా.. ఇటీవలే వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తుది తీర్పు చెప్పారు. హత్య కేసులో ఏ-1గా ఉన్న మారుతీరావు (అమృత తండ్రి) కేసు విచారణ కొనసాగుతుండగానే 2020 విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏ-2 సుభాష్‌శర్మ, ఏ-3 అస్ఘర్ అలీ, ఏ-4 అబ్దుల్ బా రీ, ఏ-5 కరీం, ఏ-6 శ్రవణ్‌కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాం నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉంటుండగా.. అస్ఘర్ అలీ మరో కేసులో సబర్మతి జైలులో ఉన్నాడు. మిలిగిన ఐదుగురు బైయిల్‌పై బయటకు వచ్చి విచారణకు హాజరవుతున్నారు.
కన్నీటిపర్యంతమైన అమృత చిన్నమ్మ, సోదరి..
ఈ కేసులో ఏ-6 నిందితుడిగా ఉన్న మారుతీరావు సోదరుడు తిరునగరి శ్రవణ్‌కుమార్‌కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించడం తో అతడి భార్య, కుమార్తె కోర్టు ఎదుట కన్నీంటి పర్యంతమయ్యారు. శ్రవణ్‌కుమార్ ఏ తప్పూ చేయకున్నా పోలీసులు తెల్ల పేపర్‌పై సంతకాలు పెట్టించుకొని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారికి నచ్చజెప్పి కారులో ఎక్కించి బయటకు పంపారు.
హైకోర్టుకు వెళ్లినా లాభం ఉండదు : హైడ్రా కమిషనర్
ప్రణయ్ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్, నాటి నల్లగొండ ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ స్పందించారు. ఈ కేసులో హైకోర్టుకు వెళ్లినా న్యాయపరంగా పెద్దగా మార్పు ఉండదన్న అభిప్రాయం వెలిబుచ్చారు. అం త పకడ్బందీగా ఈ కేసులో 1600 పేజీల ఛార్జిషీట్ వేశామని తెలిపారు.
విచారణ సమయంలోనే పోలీసులపై కొందరు నిరాధార ఆరోపణలు చేసినా తాము పట్టించుకోలేదని తెలిపారు. నిజాలు నిలకడగా తెలుస్తాయన్న సమ్మకంతో ముందుకు సాగామని చెప్పారు. ఈ కేసు టీనేజ్ యువతకు, వారి తల్లిదండ్రులకు ఓ గుణపాఠమని రంగనాథ్ పేర్కొన్నారు.
తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలి : ప్రణయ్ తండ్రి బాలస్వామి
ప్రణయ్ హత్య కేసు తుది తీర్పు నేపథ్యంలో మిర్యాలగూడలో ప్రణయ్ సమాధి వద్ద అతడి తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత, భార్య అమృత కుటుంబీకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలస్వామి కోర్టు తీర్పుపై స్పందించారు.
ఈ తీర్పుతో నేర ప్రవృత్తి ఉన్నవారిలో మార్పురావాలని ఆక్షాంక్షించారు. పరువు హత్యలు ఇకపై జరగొద్దని ఆకాంక్షించారు. ప్రణయ్ హత్యతో తాము సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.