20-03-2025 07:49:03 PM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల(Betting Apps) వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. బెట్టింగ్ యాప్ లకు ప్రచారకర్తలుగా ఉన్న నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ లపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణకు పిలుస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్(Senior actor Prakash Raj) పేరు కూడా ఉండడంతో, ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదిక((X Platform))గా వీడియో విడుదల చేసి స్పందించారు. ఆన్లైన్ గేమింగ్ యాప్ కేసుల గురించి, నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతోందని ఇప్పుడే నాకు తెలిసిందన్నారు. 2016లో ఆ యాడ్ చేసిన మాట నిజం.. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను... అది తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నాని అన్నారు. 2017లో ఒప్పందం పొడిగిస్తామని అడగగా.. వద్దని చెప్పా అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
ఆ యాడ్ను ఇకముందు ప్రసారం చేయవద్దని కూడా వాళ్లని కోరానని చెప్పారు. నేను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్(Gaming App)లకు ప్రచారకర్తగా లేను' అని అన్నారు. “2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే.. ఏదో సోషల్ మీడియా వేదికలో వారు నా ప్రకటన వాడారని, నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు కూడా పంపానని తెలిపారు. వెంటనే ఆ కంపెనీ వాళ్లు ఆ ప్రకటనని ఆపేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో ఆ ప్రకటన మళ్లీ లీకైందని, అందువల్లే ఈ సమాధానం చెబుతున్నానని అన్నారు. ఇప్పటివరకూ పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సందేశం నాకు రాలేదని, ఒకవేళ వచ్చినా వాళ్లకు వివరణ ఇస్తానని ప్రకాశ్ రాజ్ సూచించారు.