calender_icon.png 28 October, 2024 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోకి ప్రకాశ్‌గౌడ్

13-07-2024 01:23:14 AM

  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ 
  • నేడు అరికెపూడి గాంధీ వంతు 
  • ఎనిమిదికి చేరిన వలస ఎమ్మెల్యేల సంఖ్య 

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేరికల విషయంలో దూకుడు పెంచింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా చేర్చుకుంటూ అసెంబ్లీలో తమ సంఖ్య ను పెంచుకుంటోంది. రాష్ట్రంతో పాటు ప్రధానంగా  గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బల పడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోం ది. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరగా శుక్రవారం ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌశ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకాష్‌గౌడ్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కూడా శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నెలరోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రకాశ్‌గౌడ్ కలిశారు. అప్పుడే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ, నియోజకవర్గ అభివృద్ది కోసమే సీఎంను కలిశానని, బీఆర్‌ఎస్‌ను విడేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2014లో టీడీపీలో గెలిచిన ప్రకాశ్‌గౌడ్ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో రెండుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు.

ఇప్పటివరకు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో దానం నాగేందర్ (ఖైరతాబా ద్), కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కాలే యాదయ్య (చేవెళ్ల), డాక్టర్ సంజయ్‌కుమార్ (జగిత్యాల) ఉన్నారు. త్వరలోనే మరికొందరి చేరికలు ఉంటాయని, బీఆర్‌ఎస్ పార్టీలో నలుగురు మాత్రమే మిగులుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 

క్యూలో మరో ఆరుగురు 

బీఆర్‌ఎస్‌ను వలసల సమస్య వెంటాడుతుండగా.. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న వారి సంఖ్య రోజురో జుకు పెరుగుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. గ్రేటర్‌కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి చేరనున్నట్లు ప్రచారం జరగుతోంది. రోజుకో ఎమ్మె ల్యే పార్టీని వీడుతుండటంతో గులాబీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. రానున్న రోజుల్లో పార్టీ మనుగడపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల క్రితం మంత్రి శ్రీధర్‌బాబును నగరానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని కోరారు. వారంతా కాంగ్రెస్ గూటికి చేరేందు కు సిద్ధమైనట్లు గాంధీభవన్‌లో ప్రచారం సాగుతుంది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవ రం కృష్ణారావు, ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్.. బీఆర్‌ఎస్ నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.

మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం రెండు మూడు రోజుల్లో ఆరుగురు ఎమ్మెల్యే లు తమ పార్టీ కండువా కప్పుకుంటారని బాహాటంగానే పేర్కొంటున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ త్వర లో బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుందనే బీఆర్‌ఎస్ వలసలు వస్తున్నాయ్యన్నారు. 

గ్రేటర్‌పై పట్టు కోసం 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ తరఫున ఒక ఎమ్మెల్యే కూడా విజయం సాధించలేదు. బీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజధానిపై పట్టు దొరకడంలేదు. అందుకోసం నగర ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ స్థానం దక్కించుకునేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరో పదేళ్లు రేవంతే: ప్రకాశ్‌గౌడ్

చంద్రబాబు సీఎం అవ్వడం ఆనందంగా ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. ఆయన తన రాజకీయ గురువని తెలిపారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉంటాడని జోస్యం చెప్పారు. శుక్ర వారం నాడు ఆయన తిరుమల వెంకటేశ్వరున్ని దర్శించుకున్న తర్వాత మీడి యాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి యువకుడు, ఎంతో చురుకైనవాడని ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం పురోగమిస్తుందని తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో తన చేరిక అని తెలిపారు. అధికార పార్టీలో ఉంటే సమస్యలన్నీ తీరుతాయని ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. పార్టీ లో చేరిక విషయంలో తనను ఎవరూ భయభ్రాంతులకు గురి చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ మారే సమయంలో ఆలోచించలేనంత చిన్నపిల్లలం కాదని తమ ఇష్టానుసారంగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు.