calender_icon.png 29 September, 2024 | 11:10 PM

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు

09-09-2024 06:23:48 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వివిధ సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెజ్జూర్ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన చౌదరి సురేష్ తాను బెజ్జూర్ ప్రాథమిక సహకార సంఘంలో రుణం పొందకపోయిన తీసుకున్నట్లుగా చూపుతుందని, ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

కౌటాల మండలం వీరవెల్లి గ్రామానికి చెందిన దహగాంకార్ హీరామన్ తన తండ్రి పేరిట గల భూమిని తన పేరిట విరాసతో చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చింతల మానేపల్లి మండలం రుద్రపూర్ గ్రామానికి చెందిన దుర్గం శంకర్ తాను బెజ్జూర్ సహకార బ్యాంకులో రుణం పొందకపోయిన తీసుకున్నట్లుగా చూపుతోందని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ ధరఖాస్తు అందజేశారు. బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన నికాడి లక్ష్మీబాయి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్ లైన్ లో నమోదు చేసి నూతన వాసు పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాగజ్ నగర్ మండలం బోడపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో 55 కుటుంబాలు ఇండ్లు నిర్మించుకొని ఉన్నామని, కొందరు ఇట్టి భూమిని అక్రమంగా పట్టా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన గడిల మల్లయ్య, గడిల శంకర్ తమ తల్లి పేరుతో ఉన్న భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఈ విషయమై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం పులికుంట గ్రామానికి చెందిన మొడెం సుజాత జాతీయ రహదారి నిర్మాణంలో తనకు రావలసిన నష్టపరిహారమును వేరొకరు అక్రమంగా పొందారని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామానికి చెందిన పబ్బాల బాపు తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.