ప్రజా గొడవలన్నింటినీ ‘నా గొడవ’ అంటూ గొంతెత్తిన తెలంగాణ వేగుచుక్క కాళోజీ నారాయణరావు. ఆ ప్రజల మనిషి జీవిత చరిత్రను తెరకెక్కించింది జైనీ క్రియేషన్స్. ‘ప్రజాకవి కాళోజీ’ పేరుతో రూపొందిన ఈ బయోపిక్‌లో మూలవిరాట్, పద్మ,రాజ్‌కుమార్, స్వప్న ప్రధాన తారాగణంగా ఉన్నారు. ‘అమ్మ నీకు వందనం’, ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’ వంటి సినిమాలను రూపొందించిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ నిర్మించారు. ఈ సినిమాలో కాళోజీతో చిరకాలం సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ల రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీఎస్‌రెడ్డి, అన్వర్ నటించారు.
ఇంకా ఈ చిత్రంలో కవి తుమ్మూరి రామ్మోహన్‌రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్‌రెడ్డి, లాయర్ చౌహాన్, మిసెస్ ఇండియా సుష్మా తోడేటి తదితరులు నటించారు. చిత్రంలోని పీవీ నరసింహారావు పాత్రలో ఆయన సోదరుడు, పీవీ మనోహర్‌రావు కనిపిస్తారు. జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైఎస్సార్ శర్మ కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి బ్యానర్: జైనీ క్రియేషన్స్; కెమెరా: దివంగత రవికుమార్ నీర్ల; సెకండ్ యూనిట్ కెమెరా: భాస్కర్; సంగీతం: ఎస్‌ఎస్ ఆత్రేయ; నేపథ్య సంగీతం: మల్లిక్ ఎంవీకే; ఎడిటింగ్: కొండవీటి రవికుమార్; నిర్మాత: విజయలక్ష్మి జైనీ; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.
విద్యార్థులకు ఉచిత ప్రవేశం
సినిమా విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎంపిక చేసిన 24 థియేటర్లలో ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. డిసెంబర్ 23 నుంచి 29వ తేదీ వరకు ఈ ఫ్రీ షోలు అందుబాటులో ఉంటాయి. వారం రోజుల పాటు రోజూ ఒక్క ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మార్నింగ్ షో చూసేందుకు స్కూలు పిల్లలను ఉచితంగా అనుమతిస్తాం’ అని చెప్పారు.