విశాఖపట్నం,(విజయక్రాంతి): విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభ వేదికగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండిస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్, గుత్తి-పెండేకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేటలో 6 లేన్ల బైపాస్ రోడ్డును జాతీకి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి తెలుగులో కృతజ్ఞతలు తెలిపారు. సింహాచలం వరాహనరసింహస్వామికి నమస్కారం చేశారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారి తాము మూడోసారి అధికారంలోకి వచ్చామని, ఏపీ ప్రజల ఆకాంక్షల సాధనకు మద్ధతుగా నిలుస్తూ చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటామని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం పెట్టుకున్నారు. ఏపీ సర్కార్ తో భుజంభుజం కలిపి నడుస్తామని, ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు ఏపీ వికాసానికి తోడ్పడుతాయని మోదీ స్పష్టం చేశారు.
ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుందని, ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 2030 లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి తామ లక్ష్యం అన్నారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్ లు వస్తుంటే.. ఒకటి విశాఖకు కేటాయించినట్లు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి వస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లోనే బల్క్ డ్రగ్ పార్కులు వస్తాయని, అందులో ఒకటి దానికి నక్కపల్లి లో శంకుస్థాపన చేశామన్నారు.