calender_icon.png 17 October, 2024 | 7:59 AM

కశ్మీర్‌లో ప్రజా సర్కార్

17-10-2024 01:36:52 AM

సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం

డిప్యూటీ సీఎంగా సురీందర్‌సింగ్

ఐదుగురు మంత్రులతో క్యాబినెట్

ప్రభుత్వంలో చేరొద్దని కాంగ్రెస్ నిర్ణయం

హాజరైన ఇండియా కూటమి పెద్దలు

శ్రీనగర్, అక్టోబర్ 16: దాదాపు ఆరేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఇండియా కూటమి మిత్రపక్షాలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

జమ్ముకశ్మీర్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణం చేశారు. శ్రీనగర్‌లో ప్రఖ్యాత దాల్ లేక్ ఒడ్డున ఉన్న షేర్ ఏ కశ్మీర్ అతర్జాతీయ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ)లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లాతో లెఫినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  సీఎంగా ప్రమాణం చేయించారు.

మరో ఐదు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే సతీశ్ శర్మతోపాటు ఎన్సీ ఎమ్మెల్యేలు సకిన ఇటూ, జావేద్ దార్, సురీందర్‌సింగ్ చౌదరి, జావిద్ రాణా మంత్రులుగా ప్రమాణం చేశారు. జమ్ములో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవిందర్ రైనాను ఓడించిన సురీందర్‌సింగ్ చౌధరికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. 

రాష్ట్ర హోదా వచ్చేవరకు ప్రభుత్వంలో చేరం: కాంగ్రెస్

జమ్ముకశ్మీర్ మంత్రివర్గంలో మొత్తం 9 మంది మంత్రులకు అవకాశం ఉన్నది. బుధవారం ఐదుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్యాబినెట్‌లో ఏకైక మహిళ సకిన ఇటూ. ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక వాధ్రా, మల్లికార్జున ఖర్గేతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే, సీపీఐ నేత డీ రాజా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఒమర్ అబ్దుల్లాను అభి నందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కలిసే పోటీచేసినా ఒమర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరలేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లు జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వంలో చేరుతామని జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా ప్రకటించారు. అప్పటివరకు బయట నుంచి మద్దతిస్తామని చెప్పారు. ‘ప్రస్తుతం జమ్ముకశ్మీర్ క్యాబినెట్‌లో కాంగ్రెస్ పార్టీ చేరటంలేదు.

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పున రుద్దరించాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రేమో పబ్లిక్ మీటింగుల్లో రాష్ట్రహోదా ఇస్తామని ప్రకటనలు చేయటమే తప్ప ఇవ్వటం లేదు. ప్రధాని తీరుపై మేం తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. అందుకే ప్రభుత్వంలో చేరలేదు. రాష్ట్ర హోదా కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుంది’ అని తెలిపారు.

ఒకసారి రాష్ట్రానికి.. ఈసారి యూటీకి సీఎం

ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌కు సీఎం కావటం ఇది రెండోసారి. మొదటిసారి 2009-2014 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. అప్పుడు జమ్ముకశ్మీర్ రాష్ట్రం గా ఉండేది. అందులో ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ కూడా  కలిసే ఉండేది. 2014లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ, అది ఎక్కువకాలం కొనసాగలేదు.

దాదాపు 6 ఏండ్లుగా ఇక్కడ ప్రజా ప్రభుత్వం లేదు. 2019లో జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి జమ్ముకశ్మీర్, లఢక్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ను ఏర్పాటుచేసింది. నాడు రాష్ట్రానికి సీఎం అయిన ఒమర్ అబ్దుల్లానే నేడు యూటీకి కూడా సీఎంగా పగ్గాలు చేపట్టడం గమనార్హం.