వరంగల్,(విజయక్రాంతి): నవంబర్ 19వ తేదీన వరంగల్ లో ప్రజాపాలన విజయోత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. కాళోజీ కళాక్షేత్రం, పలు అభివృద్ధి పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిచనున్నారు. కాళోజీ ఆర్ట్స్ కళశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న సభలో సీఎం ప్రసంగిస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్ లో ఈనెల 19న నిర్వహించబోయ్యే ప్రజాపాలన విజయోత్సవాలపై మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ సందర్భంగా సమీక్షించారు.
డిసెంబరు 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. డిసెంబర్ 7,8,9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ఘనంగా విజయోత్సవాలు జరపనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబరు 7నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మూడు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.