02-03-2025 04:24:09 PM
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం పర్యటించారు. అనంతరం పట్టణలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట సభ(Praja Palana Pragathi Bala Sabha)లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎంపీ మల్లు రవి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... వనపర్తి నియోజక వర్గం అత్యంత రాజకీయంగా, చైతన్యవంతమైన ప్రాంతామని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మొదలు పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో ఏ కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వలేదని, ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులున్న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి మార్చి 31 లోపు రైతులకు రైతు భరోసా ఇస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రూ.2 వేలు అధికంగా రైతు భరోసా ఇస్తామని,ఇంటికో ఉద్యోగం ఇస్తామని బీఆర్ఎస్ మాదిరిగా మాయమాటలు చెప్పలేదని వెల్లడించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ దుష్ర్పచారం చేస్తుందని, భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న విధంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని, సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్, ఒకేసారి 60 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు.