calender_icon.png 27 December, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మితేనే సాధన సాధ్యం!

27-12-2024 12:19:40 AM

సాధన చేస్తే ఈ భూమ్మీద ఏదైనా సాధించవచ్చునని అంటారు పెద్దలు. నిజమే. కాని, ఏ సాధన చేస్తున్నాం? ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? ఏయే నియమాలు పాటిస్తున్నాం? శాస్త్రీయ పద్ధతిలోనే సాగుతోందా? అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. సాధన అంత సులభం కాదు. సాధనలో వచ్చే అడ్డంకులు అన్నీఇన్నీ కావు.  ఒక లౌకిక విషయాన్ని సాధించడానికే ఎంతో కష్టపడాలి. అలాంటిది అలౌకిక సాధనలకు ఎంత ఏకాగ్రత, పట్టుదల, అంకితభావం, దీక్ష ఉండాలో ఆలోచించండి. 

పుస్తకాల్లో చదివినప్పుడు అవి చేతికి అందినట్లుగానే ఉంటాయి. కానీ, ఆ సూత్రాలను పాటించినప్పుడు, ఆ నియమాలను ఆచరించేటప్పుడు సాధకులకు వాటి గొప్పతనం బోధ పడుతుంది. పతంజలి యోగ సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, యోగ మార్గాలు అని సాధనా రహస్యాలకు పేర్లు. ఋషులు ఎంతో గొప్ప కృషి చేసి, సాధన చేసి వాటిని లోకానికి అందించారు. వీటిని ఆచరణలోకి తీసుకురావడం అన్నది సాదా సీదా వ్యక్తులకు సాధ్యమయ్యే పని కాదు. చంచల మనస్కులకు అస్సలు సాధ్యం కాదు. ప్రాథమికంగా ‘నేను, నాది’ అనే అహంకారాలను త్యజించని వారికి సాధన అసలుకే అంతుచిక్కదు.

సాధన చెయ్యాలనే కోరిక కలగడమూ పూర్వజన్మ సుకృతమే. పట్టు విడవకుండా దాన్ని కొనసాగించడం మానవ ప్రయత్నం. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి. సాధనలో లోపాలు నాచుమీద నడకలా వెనక్కి లాగేస్తుంటాయి. చిల్లికుండతో నీళ్లు తెచ్చిన చందంలా ఎంత చేసినా ఇంతేనా? అనిపిస్తుంటాయి. సరైన గురుసన్నిధిలో వినయ విధేయతలతో, నీతి నిజాయితీగా, నిరాడంబరతతో నేర్చుకోవాలనే తపన కలిగిన సాధకులకు మాత్రమే ఆ సూత్రాలు అబ్బుతాయి. 

ధ్యానం చేసే వ్యక్తికి ఏకాగ్రత కావాలి. ప్రార్థన చేసే వ్యక్తిలో ఆర్తి ఉండాలి. జపం చేసే వ్యక్తికి భావన రావాలి. పూజ చేసే వ్యక్తిలో విశ్వాసం ఉండాలి. సాధనను మనం నమ్మితేనే అది మనల్ని చేరుతుంది. చేసిందే మళ్ళీమళ్ళీ పట్టుదలతో చేస్తుంటే దానిమీద పట్టు వస్తుంది. నైపుణ్యం కలుగుతుంది. ఆత్మ విశ్వాసం నెలకొంటుంది. చివరికి సాధన మనకు మోకరిల్లుతుంది.

అర్జునుడి సాధన అతణ్ని గొప్ప విలుకాడిని చేసింది. హనుమంతుడి రామనామ జపం ఆయన్ని గొప్ప భక్తుడిని చేసింది. “సాధన అనేది ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది” అని శ్రీరాముడికి వసిష్ఠుడు బోధించాడు. సత్యం కోసం అరుణాచల కొండను ఆశ్రయించిన రమణులు మౌనదీక్షతోనే సాధించారు.

మొదట సాధన చెయ్యాలి. తర్వాత తెలుసుకున్న సత్యాన్ని నిలబెట్టుకోవడానికి కృషి జరగాలి. మెట్టుమెట్టు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరుకోవాలి. బొట్టుబొట్టు కలిస్తేనే సముద్రమవుతుంది. చిత్తశుద్ధితో చేసింది ఎక్కడికీ పోదు. లోపాలు వాటంతటవే సరి అవుతాయి. శాస్త్రం మీద, గురువు మీద, సాధన మీద నమ్మకం ఉన్నవారు ఎప్పటికైనా విజేతలవుతారు.