రేపే కోనసీమలోని జగ్గన్నతోటలో ఏకాదశరుద్రుల సమావేశం
ప్రకృతి అందాలతో పరవసింపజేసే మూడు పాయలుగా వీడిన గోదావరి నది లంకలు, ఆ లంకల్లో సుందరమైన కొబ్బరి తోటలు, రంగురంగుల పూలతోటలు, వాటిపై ఆవాసాలుండే విహంగాల కుహుకుహు గానాలు, గోదావరి జలాల పరవళ్లు వెరసి ఆంధ్రప్రదేశ్‌లో దైవభూమిగా పిలిచే కొనసీమగా కనువిందు చేసే ఆ ప్రదేశం పట్ల యక్షులు, ఋషులు కూడా ముచ్చటపడి ఈ దివ్యమైన కొనసీమలోని జగ్గన్నతోట కొబ్బరితోటలో సమాలోచనలు, విహారాలు జరిపేవారని ప్రతీతి.
లోకకళ్యాణం కోసం పూర్వం ఈ కోనసీమలోని ప్రస్తుతం అంబాజీపేట మండలం మోకాళ్లపల్లి గ్రామంలోని పెద్దన్నగారితోటగా పిలిచే ప్రకృతి ప్రశాంతతలు వెల్లివిరిసే ఒక కొబ్బరితోటలో మకర సంక్రాంతి పండగ మరునాడు అంటే మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలం కనుమ రోజు ఏశాదశిరుద్రులు సమావేశమై లోక కల్యాణం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఈ జగ్గన్నపేట తోటలో ఏవిధమైన గుడి గోపురాలు లేవు. కేవలం కొబ్బరితోటలో అనాటి ఏకాదశ రుద్రుల సమావేశం నుంచి ఇప్పటివరకు ఇక్కడ నిర్వహించే ఏకాదశ ప్రభల తీర్థానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని వారు కూడా ఈ ప్రభల తీర్థానికి విచ్చేసి.. రంగురంగులతో అలంకరించిన ప్రభలపై కొలువున్న మునులను శ్రద్ధలతో దర్శించుకుంటారు.
రంగురంగుల వస్త్రాలు, పువ్వులతో అలంకరించిన గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ప్రభపై చెన్నమల్లేశ్వర స్వామి, వీరేశ్వరస్వామి విగ్రహాల్ని అలంకరించి జగ్గన్నతోటకు కొందరు సుశిక్షితులైన యువకులు మోసుకొస్తారు. అలాగే, వ్యాఘేశ్వరం నుంచి వ్యాఘేశ్వర స్వామి, జరుసుమండ నుంచి ఆనంద రామేశ్వరస్వామి, నక్కలంక నుంచి శ్రీవిశ్వేశ్వరస్వామి.
పెదపూడిలోని శ్రీమేనకేశ్వరస్వామి, ముక్కామలలోని శ్రీరాఘవేశ్వరస్వామి, మొసలపల్లి నుంచి శ్రీమధుమానంత భోగేశ్వరస్వామి వేదుమారు శ్రీవన మల్లేశ్వరస్వామి, పాలగుమ్మిలోని శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి పుల్లేటికుర్రు నుంచి వ్యాగ్రేశ్వరస్వాములను ప్రభలపై అంగరంగ వైభవంగా అలంకరించి, ఈ ప్రభలను జగ్గన్నతోటకు కాలువలు, తోటలనుంచి మరీ మోసుకొచ్చి కొలువుదీరుస్తారు. వీరే ఏకాదశరుద్రులు.
ఈ ప్రభలను ఒకసారి ఎత్తుకున్నాక కిందకు దింపకూడదు. పంటపొలాల్లో కూడా అడ్డంగా తొక్కుకుంటూ ప్రభలను తీసుకొచ్చినప్పటికీ రుద్రులు తమ పంటచేళ్లో ప్రయాణించాడన్ని రైతులు పరవసిస్తారు. పోతే కౌశిక నది దాటేటప్పుడు ప్రభలు ఏ మాత్రం తడవకుండా తీసుకొస్తారు. ఈ ప్రభలను ఆయా గ్రామాల నుంచి ప్రభలు మోయడానికి ఇరవై మంది శిక్షణ పొందిన వ్యక్తులు పవిత్రంగా, నిష్టగా ఉంటారు. కౌశిక నదిని దాటించడానికి మాత్రం తడవకుండా ఉండేలా యాభై మందికి పైగా శిక్షణ పొందిన యువకులు ఉంటారు. కౌసికనది దాటించి తీర్థ ప్రవేశానికి తీసుకొస్తారు.
ప్రతీ గ్రామం నుంచి తీసుకొచ్చే ఈ ఏకాదశ రుద్రులకి కావాల్సిన ప్రభలు ఏవూరిలో వారు ఆ ఊరిలో వస్తుసామగ్రి సేకరించి సంక్రాంతికి పది రోజుల ముందు నుంచి ముహూర్తంలో ప్రభ తయారీని మొదలు పెడతారు. తొలుత వెదురు బద్ధలతోనూ, ఆచారం ప్రకారం అక్కడే విరివిగా పండే కొబ్బరి కాయల పేరుతో చేసిన కొబ్బరి లేక కంబారు పేరుతో పిలిచే తాడుతోకట్టి ప్రభ ఆకారం తీసుకొస్తారు. కొనసీమలోనే పూసిన రంగులపూలతో కనువిందు చేసేలా మాలలు కట్టి సుందరంగా ఒకరిని మించి మరొక ఊరు వాళ్లు రుద్రుల ప్రభలను పొటీగా అలంకరిస్తారు.
ఒక పక్క వశిష్ఠ గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ గోదావరి పాయల మధ్యనున్న పైరుపచ్చని లంకల అందాలు, మరొక వంక సమావేశంలో కొలువై లోక కల్యాణం కోసం చర్చిస్తున్నట్లుగా అమర్చిన ఏకాదశ రుద్రుల ప్రభలను వరుసగా ఉంచి, వారి చల్లని దీవెనలు పొంది సాయంత్రం ఎవరికి వారు గ్రామాలకు రుద్రులు ప్రభలతో సహా తిరిగి వెళ్లడం అనిర్వచనీయమైన అనుభూతి.
ఈ ప్రభల తీర్థం విశిష్టత గూర్చి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గతంలో పంపిన ఓ సందేశంలో ఈ ఏకాదశి రుద్రుల ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి పవిత్ర ప్రతీక అని, అందిన చారిత్రక ఆధారాలను బట్టి ఐదు వందేళ్లకు ముందు నుంచి ఈ తీర్థం జరుగుతున్న విషయం ఎంతో అరుదన్నారు.
కొనసీమ గ్రామాల్లో నేటికీ ఈ భక్తి వెల్లివిరిసే సాంస్కృతి కొనసాగుతుండటం, వీటిని తిలకించేందుకు విదేశాల నుంచి సైతం ఈ ప్రాంతపు భక్తులు రావటం ఎంతో గొప్ప విషయంగా కొనియాడారు. ఇలాంటి చారిత్రత్మాక, అరుదైన అపురూపమైన ఏకాదశి రుద్రుల సమావేశాన్ని చూసేందుకు ఎక్కడివారైనా సమాయాత్తం కావాల్సి వుంది.
సీనియర్ జర్నలిస్ట్ 9491545699