calender_icon.png 30 November, 2024 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్

30-11-2024 12:44:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): “తెలంగాణ ప్రభుత్వంలో కీలకస్థానంలో పనిచేసిన నన్ను ప్రస్తుత సర్కారు రాజకీయంగా వేధిస్తోంది.. నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి” అంటూ ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్‌డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు అనుమతి కోరిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ విషయంలో కేసు దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోం శాఖ.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపి ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులను విచారణకు అనుమతించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్ అధికారుల ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్‌రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఫ్లోరిడాలోని తన కుమారుడి వద్ద ఉంటున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇదే కేసులో మరో నిందితుడైన ఓ ఛానల్ ఎండీ శ్రవణ్‌రావు చికాగోలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.