19-03-2025 01:28:01 AM
ఒకరికి తీవ్ర గాయాలు
లైన్ మెన్ ను స్తంభానికి కట్టేసి చితకబాదిన వర్కర్లు
లైన్ మెన్, ఏ ఈ పై కేసు నమోదు
మేడ్చల్, మార్చి 18(విజయ క్రాంతి): స్తంభంపై ఒకరు పనిచేస్తుండగా మద్యం మత్తులో విద్యుత్ సరఫరా చేయించిన లైన్ మెన్ ను స్తంభానికి కట్టేసి చితకబాదిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కిష్టాపూర్ నుంచి రావల్కోలు కమాన్ వరకు 11 కెవి విద్యుత్తు లైన్ పనులు జరుగుతున్నందున ఉదయం 8 నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని విద్యుత్ అధికారులు ముందుగానే ప్రకటించారు. దీంతో కూలీలు విద్యుత్తు లైన్ పనుల్లో నిమగ్నమయ్యారు.
మద్యం మత్తులో ఉన్న లైన్మెన్ మాధవరెడ్డి సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా చేయించాడు. దీంతో స్తంభం పై పనులు చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన గుగులోతు రమేష్ (25) విద్యుత్ షాక్కు గురై కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు ఆగ్రహానికి గురై లైన్మెన్ మాధవరెడ్డిని స్తంభానికి కట్టేసి చితకబాదారు.
విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు అక్కడికి చేరుకొని లైన్ మెన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి కారకుడైన లైన్మెన్ మాధవరెడ్డి తో పాటు, ఏ ఈ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.