calender_icon.png 23 October, 2024 | 10:52 AM

ఐదేళ్లలో విద్యుత్‌రంగం నాశనం

10-07-2024 05:01:01 AM

  • శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి) : ఐదేళ్ల వైసీపీ అసమర్ధ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్ రంగానికి రూ. 1.29,500 కోట్ల నష్టం వాటిల్లింద ని, విద్యుత్ రంగంలో రూ.49,596 కోట్లు అప్పు చేశారని విమర్శించారు. మంగళవారం సీఎం చంద్రబాబు అమరావతి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2014 సౌరశక్తి, పవన శక్తి ద్వారా విద్యుత్ ఉత్పాదకతను పెంచినట్లు పేర్కొన్నారు. 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు.

2018 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరేలా చేశామన్నారు. టీడీపీ హయాంలో ట్రాన్స్‌కో, జెన్‌కోలకు అవార్డులు కూడా లభించాయన్నారు. అలాంటి విద్యుత్ రంగాన్ని గత వైసీపీ సర్కారు కుదేలు చేసిందని, ట్రూ అప్, ఇంధన సర్‌చార్జ్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాల పేర్లతో ప్రజల నుంచి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేసిందని విమర్శించారు. గృహ వినియోగదారులపై  45 శాతం చార్జీలు పెంచడంతో కోటి 53 లక్షల మందిపై భారం పడిందని తెలిపారు. 50 యూనిట్లు వాడిన పేదలపై కూడా వంద శాతం చార్జీలు పెంచారని ఆరోపించారు. టారిఫ్ పెంపు ద్వారా రూ.16,699 కోట్లు, ట్రూ అప్ ద్వారా రూ.5886 కోట్లు, విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రూ.3977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ.5607 కోట్ల మేర ప్రజల నుంచి వసూలు చేశారని ఆరోపించారు.

వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుని విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. తద్వారా ఐదేళ్ళలో విద్యుత్ సంస్థల అప్పు 79 శాతం పెరిగిందని ఆరోపించారు. కొన్నిసార్లు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై పెను భారం మోపాయన్నారు. పవన విద్యుత్ ఉత్పత్తికి గాను చేసుకున్న 21 ఒప్పందాలను రద్దు చేశారని, అసమర్ద పాలనతో విద్యుత్ రంగం 47,741 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి సుమారు రూ.1,29,503 కోట్ల నష్టం వాటిల్లిందని, విద్యుత్ రంగాన్ని త్వరలో గాఢిలో పెడతామని హామీ ఇచ్చారు.