calender_icon.png 18 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు విద్యుత్ ప్లాంట్లు

18-11-2024 01:44:48 AM

  1. కోటిమందిని కోటీశ్వరులను చేస్తాం 
  2. మహిళా సంఘాల సభ్యులకు బీమా సౌకర్యం
  3. ట్రాన్స్‌జెండర్లకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్‌లు
  4. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): కోటి మంది మహిళలను కోటీశ్వ రులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 19వ తేదీన హన్మకొండలో నిర్వహించే విజయోత్సవ సభ వేదికగా వెల్లడించే నూతన పథకాలపై సచివాలయంలో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు.

నూతన పథకాల విధివిధానాలు, సభా ప్రాంగణంలో సెర్ప్ ఆధ్వర్యం లో స్టాళ్లు, సభ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మహిళా సాధికారత థీమ్‌తో విజయోత్సవ సభ నిర్వహించనున్నామని, ఈ వేదికగా మహిళా సాధికారతకు సంబంధించిన వినూత్న పథకాలను వెల్లడిస్తామని చెప్పారు.

22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి మహిళా సంఘాలకు విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం కేటాయిస్తుందని స్పష్టం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు బీమా సౌకర్యంతోపాటు ట్రాన్స్‌జెండర్ల కోసం జిల్లా కేంద్రా ల్లో ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, మహిళా,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు.

విజయోత్సవ సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు సురేఖ, సీతక్క

జనగామ (వరంగల్) (విజయక్రాంతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమ ని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నా రు. వచ్చే సోమవారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం వారు పరిశీలిం చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు సీఎం శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవన్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఆ పార్టీల నాయకులు రాజకీయాలు తప్పా ప్రజా సంక్షేమం పట్టదని మండిపడ్డారు. మంత్రుల వెంట జిల్లా నాయకులు, అధికారులు ఉన్నారు.