calender_icon.png 26 September, 2024 | 1:55 AM

యాంటీబయాటిక్స్ ముసుగులో పౌ‘డర్’

25-09-2024 04:21:32 AM

 వెలుగులోకి కొత్త నకిలీ దందా

నాగ్‌పూర్, సెప్టెంబర్ 24: ఔషధాల ముసుగులో పౌడర్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ప్రభుత్వ దవాఖానలకు సరఫరా చేస్తున్న యాంటీబయా టిక్స్‌లో టాల్కమ్ పౌడర్ నింపి రూ.కోట్ల కుంభకోణాన్ని నాగ్‌పూర్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నకిలీ ఔషధాల సర ఫరా కేసులో సెప్టెంబర్ 20న 1,200 పేజీల చార్జ్‌షీట్‌ను  సమర్పించారు. 

ప్రభుత్వ దవాఖానాలకు సరఫరా చేసే యాంటీ బయాటిక్స్‌లో టాల్కమ్ పౌడర్ మాత్రమే ఉందని.. ఈ దందా హరిద్వార్‌లోని ఓ ల్యాబ్‌లో వెలుగుచూసినట్లు వెల్లడించారు. వెటర్నరీ మెడిసిన్స్ తయారు చేసే ఓ ప్రయోగశాలలో ఈ పౌడర్ తయారు చేసినట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.

నకిలీ ఔషధాలే కాకుండా ఈ దందా నుంచి అక్రమంగా సంపాదించిన రూ.కోట్ల డబ్బును చెలామణీకి హవాలా రూపంలో ఇతర ప్రదేశాలకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముంబై నుంచి యూపీలోని సహరన్‌పూర్‌కు డబ్బులు చేరవేసినట్లు కనుగొన్నారు. నకిలీ ఔషధాలను దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ దవా ఖానలకు పంపినట్లు పోలీసులు తేల్చారు.

ఇంతటి షాక్‌కు గురి చేసిన ఈ ముఠా గతేడాది డిసెంబర్‌లోనే పట్టుబడింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ భందాకర్ చొరవతో వీరి గుట్టు రట్టయింది. కమలేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన యాంటీబయాటిక్స్ నకిలీవని తేల్చారు. దీంతో అసలు ఆ మందు లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీసిన ఆ అధికారి ఈ ముఠాను పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒకరి తర్వాత ఒకరుగా నేరస్తులు బయటపడ్డారు.