19-04-2025 01:24:46 AM
మేడ్చల్, ఏప్రిల్ 18(విజయ క్రాంతి): 16 నెలల కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే ఎక్కువ దరిద్రం ఉందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఘట్కేసర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇంత నష్టం జరగలేదని, కాంగ్రెస్ పాలనలో అన్ని విధాల నష్టం జరుగుతోందన్నారు.
రియల్ ఎస్టేట్ లేక పెళ్లిలు చేయలేకపోతున్నారన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగు, సాగు నీరు లేదని, పెన్షన్లు అందడం లేదన్నారు.
బీ ఆర్‌ఎస్ పాలనలో చరిత్రలో గుర్తుండిపోయేలా అభివృద్ధి జరిగిందన్నారు. కెసిఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రపంచమంతా కెసిఆర్ వైపు చూస్తోందన్నారు. కెసిఆర్ మళ్లీ వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ సభకు తరలి రావాలి
వరంగల్ లో ఈనెల 27న నిర్వహించనున్న బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఘట్కేసర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ లో వరంగల్ సభ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు